జాతీయ క్రీడా పురస్కారాల్లో ఒకటైన 'అర్జున' దక్కడం పట్ల టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. 13 ఏళ్లపాటు పడ్డ కష్టానికి ఇది ప్రతిఫలమని అన్నాడు. ఈ అవార్డు తనను వరించడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో గర్వపడుతున్నారని ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
"అర్జున అవార్డుకు ఎంపికైనప్పటి నుంచి చాలా ఆనందంగా ఉంది. గత 13 ఏళ్లుగా చాలా కష్టపడ్డాను. కాబట్టి ఈ పురస్కారం దక్కడం నాకు నా కుటుంబానికి ఎంతో గర్వకారణం. నా కంటే నా భార్య ఇంకా గర్వపడుతోంది. ఎందుకంటే ఇది నాకు రావాలని ఆమె బలంగా కోరుకుంది"
-ఇషాంత్ శర్మ, టీమ్ఇండియా బౌలర్
బౌలింగ్‌లో టీమ్ఇండియా సత్తా చాటుతుండటానికి గల కారణాల్ని ఇషాంత్ వెల్లడించాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రదర్శనలపై దృష్టి పెట్టకుండా మ్యాచ్ గెలిచేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని చెప్పాడు.
జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ క్రీడా పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రదానం చేయనుంది. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నకు ఐదుగుర్ని.. అర్జున అవార్డు కోసం 27 మందిని ఎంపిక చేసింది. ఖేల్‌రత్న రోహిత్ శర్మకు దక్కగా.. ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు 'అర్జున' వరించింది.