ఈ ఏడాది ఐపీఎల్లో తొలిసారి ఓ అమెరికన్ క్రికెటర్ ఆడబోతున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తరఫున పేసర్ అలీ ఖాన్ ఆడనున్నట్లు ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మెగాలీగ్ చరిత్రలో ఆ దేశ ఆటగాడు ఆడడం ఇదే తొలిసారి అవ్వడం వల్ల ఖాన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ పేసర్ హ్యారీ గున్రే భుజం గాయంతో ఇటీవల ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ కారణంతో గున్రే స్థానంలో అలీ ఖాన్‌ను భర్తీ చేసింది కేకేఆర్ యాజమాన్యం. ప్రస్తుతం ఆ జట్టు స్క్వాడ్‌లో ఏడుగురు విదేశీ ఆటగాళ్లతో కలిపి మెుత్తం 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. సీపీఎల్ 2020 విజేత ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున అలీ ఖాన్ ఆడాడు. అందులో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ నేతృత్వంలో నైట్‌రైడర్స్ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2019లో పవర్ హిట్టర్ ఆండ్రూ రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఆ జట్టు అసాధారణ విజయాల్ని అందుకుంది. కానీ పేలవ బౌలింగ్ కారణంగా గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంది. దీంతో ఈ సీజన్ ఆటగాళ్ల వేలంలో కోల్‌కతా ఫ్రాంచైజీ బౌలర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్‌ను రూ. 15.50 కోట్లకు దక్కించుకుంది. హ్యారీ గున్రేను కూడా తీసుకుంది. కానీ అతడు తప్పుకోవడం వల్ల తాజాగా అలీ ఖాన్‌ను ఎంపిక చేసింది.
ఇదీ చూడండి బీసీసీఐ వార్షిక సమావేశం నిరవధిక వాయిదా