ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత కెప్టెన్ రహానెను రనౌట్‌గా ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అంపైర్లు పక్షపాతం చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటలో రహానె బ్యాట్ క్రీజ్లైన్పై ఉన్నప్పటికీ థర్డ్ అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించారు. తొలి రోజు సరిగ్గా ఇలాగే క్రీజులైన్పై బ్యాట్ పెట్టిన ఆసీస్ సారథి టిమ్‌పైన్‌కు మాత్రం నాటౌట్ ఇచ్చారు. ఇరుజట్ల విషయంలో అంపైర్లు ఇలా చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదేం అంపైరింగ్? (నెటిజన్ల వ్యాఖ్యలు..)
"ఇది పక్షపాతపూరిత అంపైరింగ్ కన్నా ఏమీ కాదు", "రహానె ఎంత తేడాలో ఔటయ్యాడో.. అంతే తేడాతో పైన్ నాటౌట్‌గా నిలిచాడు", "నిన్నటి లెక్క ప్రకారం చూస్తే రహానె నాటౌట్. ఈ ఔట్‌కు పైన్ నాటౌట్‌కు తేడా లేదు", "మోసం. ఓ రకమైన సంఘటనలో పైన్‌కు మేలు, రహానెకు శిక్ష.. ఇది సరైనది కాదు", "రహానెను త్వరగా ఔట్ అని తేల్చారు. కానీ, పైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. ఇద్దరూ ఔటే"
గల్లీ క్రికెట్ కన్నా అధ్వాన్నంగా ఐసీసీ నిబంధనలు ఉన్నాయని ఇప్పటికే క్రికెట్ ప్రముఖులు పలుమార్లు విమర్శించారు. మరీ ముఖ్యంగా డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను (డీఆర్ఎస్) మార్చాలని దిగ్గజ సచిన్ సహ పలువురు మాజీలు సూచిస్తున్నారు.
బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆటలో టిమ్‌పైన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం ఇప్పటికే వివాదాస్పదమైంది. అంపైర్ల నిర్ణయాన్ని వార్న్ సహ పలువురు మాజీలు తప్పుబట్టారు. 'బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో' పైన్‌ను నాటౌట్‌గా ప్రకటించిన వారు రహానె అంశాన్ని ఎందుకు అదే కోణంలో చూడడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఆసీస్‌ను 195 పరుగులకే టీమ్ఇండియా కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రహానె 112, జడేజా 57 , గిల్ 45 అద్భుత ప్రదర్శన చేశారు. మూడో రోజు పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 133 పరుగులతో ఉంది.
ఇదీ చూడండి: 'డీఆర్ఎస్తో ఆటగాళ్లకు న్యాయం జరగట్లేదు'