చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టెస్టుకు ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. క్రీడా వేదికల్లో 50శాతం ప్రేక్షకులను అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 నూతన మార్గదర్శకాలు విడుదల చేయడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్‌సీఏ) పరిశీలిస్తున్నాయి.
"ప్రభుత్వ ఉత్తర్వులు శనివారమే వచ్చాయి. కాబట్టి ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడానికి సమయం లేదు. ఇంత తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయలేం. కానీ ఫిబ్రవరి 13న మొదలయ్యే రెండో టెస్టుకు ఆ అవకాశం ఉంది." అని టీఎన్‌సీఏ అధికారి తెలిపారు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానంలో జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని టీఎన్సీఎ ఇదివరకే ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో.. బీసీసీఐ, టీఎన్‌సీఏ అధికారుల మధ్య సోమవారం నుంచి చర్చలు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ మైదానంలో జరిగే మూడు, నాలుగు టెస్టులకు మాత్రం వీక్షకులకు అనుమతి ఉంది.
మీడియాకు ప్రవేశం!
ప్రెస్ బాక్సులో మీడియాను అనుమతించే విషయంపైనా టీఎన్‌సీఏ సమాలోచనలు చేస్తోంది.
ఇదీ చూడండి: 'కోహ్లీని ఎలా ఔట్ చేయాలో తెలియడం లేదు'