టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వచ్చే మూడేళ్లలో గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇలాగే కొనసాగితే కచ్చితంగా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తాడని చెప్పాడు.
"రాబోయే మూడేళ్లలో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ జరగనుంది. అలాగే ఐపీఎల్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాండ్య రాణించడానికి, గ్లోబల్ స్టార్‌గా ఎదగడానికి మంచి అవకాశం దొరికింది"
- మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
ఆదివారం రెండో టీ20 పూర్తికాగానే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ కూడా టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంతకుముందు మ్యాచ్ ఫినిషర్‌గా ధోనీ సేవలందించనట్లుగా ఇప్పుడు పాండ్య ఆ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడని మెచ్చుకున్నాడు. దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఆండ్రూ రసెల్ కన్నా పాండ్యనే ఉత్తమం అని అన్నాడు.
ఈ ముంబయి క్రికెటర్.. ఇటీవలే జరిగిన ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేశాడు. దాన్ని అలాగే కొనసాగిస్తూ ఆస్ట్రేలియా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో 90, మూడో వన్డేలో 92*, రెండో టీ20లో 44* పరుగులు చేసి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అలా తన ప్రదర్శనతో అందరి ప్రశంసలు సొంతం చేసుకుంటున్నాడు.