ఒక ఆటగాడిగా, బ్యాట్స్‌మన్‌గా, కెరీర్ పరంగా చూస్తే టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ అంత ప్రాధాన్యం కాదని మాజీ ఓపెనర్ ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా యూట్యూబ్ ఛానెల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి భవితవ్యంపై మాట్లాడాడు. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తేనే అవకాశాలొస్తాయనే స్థితిలో ధోనీ లేడని, అలాంటి పరిస్థితుల్ని మాజీ సారథి ఎప్పుడో దాటేశాడని చెప్పాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం ఈ ఐపీఎల్ చాలా ముఖ్యమని తెలిపాడు. ఎందుకంటే దాని ఫలితాలు మొత్తం ధోనీమీదే ఆధారపడి ఉంటాయని చోప్రా పేర్కొన్నాడు.
"ధోనీ మంచి ఫామ్‌లో ఉంటే జట్టుకు కలిసి వస్తుంది. అప్పుడు సీఎస్కేను ముందుకు తీసుకెళ్లడం అతడికి సులువవుతుంది. మహీ పరుగులు చేయలేకపోతే ఆటను ఆస్వాదించలేడు. అలా చూస్తే అతడికి ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ఒకసారి ధోనీ కెరీర్‌ను పరిశీలిస్తే.. అతడు తిరిగి జట్టులోకి వచ్చి ఆడటం పెద్ద విషయం కాదు. ఇందులో తనకు ఎలాంటి సందేహం లేదు."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఆటకు దూరమైన ధోనీ ఏడాదిగా క్రికెట్ ఆడలేదు. మార్చిలో చెన్నైలో శిక్షణాశిబిరం ప్రారంభించినా లాక్‌డౌన్‌తో ఐపీఎల్ వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 19 నుంచి ఆ మెగా ఈవెంట్ యూఏఈలో నిర్వహిస్తున్నందున అక్కడ చెలరేగి మళ్లీ టీమ్‌ఇండియాలోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.