టీమిండియాలో దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత చోటు దక్కించుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇతడి బౌలింగ్ దెబ్బకు సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ అరుదైన రికార్డుకు అతిచేరువలో ఉన్నాడు.
టెస్టుల్లో వేగంగా 350 వికెట్లు పడగొట్టిన శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో సమంగా నిలిచేందుకు ఒక వికెట్ దూరంలో నిలిచాడు. 66 టెస్టుల్లోనే 350 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు మురళీధరన్. తన కెరీర్‌లో 66వ టెస్టు ఆడుతున్న అశ్విన్ ఇప్పటికే 349 వికెట్లు పడగొట్టాడు. ఇంకా తొలి టెస్టు ఆఖరి రోజు ఆట మిగిలి ఉంది. అతడు మరో వికెట్ పడగొట్టి లంక దిగ్గజ క్రికెటర్ రికార్డును సమం చేసేందుకు అవకాశాలున్నాయి.
సఫారీలతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 502/7వద్ద డిక్లేర్ చేయగా... దక్షిణాఫ్రికా 431 పరుగులు చేసింది. అనంతరం 91 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన... 323/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 395 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా జట్టు. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన విజయం సాధించాలంటే ఆఖరి రోజు ఇంకా 384 పరుగులు చేయాలి.