మే30న ప్రపంచకప్ ప్రారంభంకాబోతుంది. ఇంగ్లండ్, వేల్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో పేస్ బౌలర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ప్రతి జట్టు తమ అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. 2019 ప్రపంచకప్‌లో ప్రధాన జట్ల బౌలింగ్ విభాగాల రేటింగ్ ఎలా ఉందో చూద్దాం..
భారత్ (8/10)
- స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, చాహల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. జడేజా రూపంలో మరో స్పిన్నర్‌తో ఈ విభాగం పటిష్ఠంగా కనబడుతోంది. అలాగే టీమిండియా ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రాతో పాటు అనుభవజ్ఞులైన బుమ్రా, షమీ ఉండనే ఉన్నారు. నాలుగో పేసర్‌గా హార్దిక్ పాండ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బౌలింగ్‌లో బలంగానే కనిపిస్తున్నా ఫిట్నెస్ ప్రధాన పాత్ర పోషించనుంది.
ఇంగ్లండ్ (9/10)
- వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్లంకెట్, టామ్ కరన్, మార్క్ వుడ్ సత్తా చాటేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్‌లాంటి ఆల్‌రౌండర్లతో భీకరంగా కనపడుతోంది ఇంగ్లిష్ సేన. స్పిన్ విభాగంలో రషీద్, మొయిన్ అలీ కీలకపాత్ర పోషించనున్నారు.
ఆస్ట్రేలియా (8/10)
- బలమైన బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతోంది కంగారూ జట్టు. ఐదుగురు ప్రధాన పేసర్లు ఉన్నారు. మిచెల్ స్టార్క్ లీడ్ రోల్లో కమిన్స్, జాసన్ బెహ్రాండార్ఫ్, నాథన్ కౌల్టర్‌నీల్, కేన్ రిచర్డ్సన్ తమ ప్రతిభను చాటుకునేందుకు శ్రమిస్తున్నారు. జట్టుకు అదనపు బలంగా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఉండనే ఉన్నాడు. జంపా, నాథన్ లియోన్‌లతో పాటు ఆల్‌రౌండర్ మాక్స్వెల్ స్పిన్ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
న్యూజిలాండ్ (7.5/10 )
- బౌలింగ్ విభాగంలో వైవిధ్యం చూపిస్తున్న జట్లలో కివీస్ ఒకటి. టిమ్ సౌథీ, బౌల్ట్ ప్రధాన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఫెర్గూసన్‌తో పాటు మాట్ హెన్రీ అవకాశం వస్తే సత్తా చాటగలడు. ఆల్రౌండర్లుగా జిమ్మీ నీషమ్, గ్రాండ్‌హోమ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టగలరు. ఇష్ సోధి, మిచెల్ సాంటర్న్లతో నాణ్యమైన స్పిన్ బౌలింగ్ ఉంది.
దక్షిణాఫ్రికా (9/10)
- ప్రపంచకప్ బౌలింగ్ విభాగంలో అత్యంత బలంగా కనిపిస్తున్న జట్లలో దక్షిణాఫ్రికా ముందుంటుంది. డెయిల్ స్టెయిన్, రబాడ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఎలాంటి పిచ్‌లపై అయినా సత్తా చాటగలరు. యువ బౌలర్ లుంగి ఎంగిడి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆల్‌రౌండర్లు క్రిస్ మోరిస్, డ్వెయిన్ ప్రిటోరియస్, ఫెహ్లూక్వాయోలు పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకోగలరు. ఇమ్రాన్ తాహిర్ స్పిన్ విభాగంలో ప్రధానపాత్ర పోషించనుండగా.. షంసీ రెండో స్పిన్నర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
పాకిస్థాన్ (7/10)
- ఈ జట్టు బౌలింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. స్పిన్నర్ షాదాబ్ ఖాన్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పేస్ విభాగంలో హసన్ అలీ, జునైద్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ ప్రధానపాత్ర పోషించనున్నారు. యువ ఆటగాడు మహమ్మద్ హస్నేన్ అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇతడితో పాటు ఫహీమ్ అష్రఫ్ ఆలౌరౌండర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ వాసిమ్ ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడు. మాలిక్, హఫీజ్లూ బంతిని స్పిన్ చేయగలరు.
బౌలింగ్ విభాగాలు ఎలా ఉన్నప్పటికీ తమదైన రోజున సత్తాచాటిన జట్టే ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఇందుకు ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఇంగ్లండ్ గడ్డపై పేస్ బౌలర్లు సత్తాచాటే అవకాశం ఉంది.