cricket new rules: క్రికెట్లో కొత్త రూల్స్ రానున్నాయి. అవి ఈ ఏడాది అక్టోబరు నుంచి అమలు కానున్నాయి. మన్కడింగ్‌ను రనౌట్‌గా పరిగణిస్తామని మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని కొత్త నియమాలను ఎంసీసీ ప్రకటించింది. వాటినీ పరిశీలించండి..
మన్కడింగ్ అంటే ఏంటి?
mankading banned by mcc: బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ క్రీజు దాటితే సదరు బౌలర్ అతడిని ఔట్ చేసే అవకాశాన్ని మన్కడింగ్ అంటారు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండే ఏ బ్యాటర్ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉంటారు. అందుకు కొన్ని సార్లు క్రీజు దాటే అవకాశం ఉంటుంది. ఇకపై బౌలర్ మన్కడింగ్‌ను రనౌట్ కింద పరిగణిస్తామని ఎంసీసీ తెలిపింది.
క్యాచ్ ఔట్లో చిన్న మార్పు..
మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్యాచ్ ఔట్‌కు సంబంధించి ఎంసీసీ చిన్న సవరణ చేసింది. ఫీల్డర్.. క్యాచ్ పట్టడానికి ముందు ఇద్దరు బ్యాటర్లు క్రీజు దాటితే.. ఇకపై క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లాలి.
వైడ్ బాల్‌గానే..
ఇకపై స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నిలుచున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా.. దానిని వైడ్‌గా పరిగణించాలనే కొత్త రూల్‌ను ఎంసీసీ అమల్లోకి తేనుంది.
సలైవా ఉపయోగించవద్దు..
బంతిని షైన్ చేసేందుకు బౌలర్లు సలైవా(ఉమ్మి) ఉపయోగించకూడదని కరోనా సమయంలో ఎంసీసీ తెలిపింది. అయితే ఇప్పుడు సలైవాను పూర్తిగా ఉపయోగించవద్దని ఎంసీసీ పేర్కొంది. సలైవా బాల్‌కు అప్లై చేస్తే టాంపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నందున నిషేధించామని తెలిపింది.
రిప్లేస్ చేస్తే..
ఏదైనా సందర్భంలో జట్టులో ఒక ఆటగాడికి బదులు మరో ఆటగాడిని రిప్లేస్ చేస్తే..ముందు ఉన్న ఆటగాడికి సంబంధించిన ఆంక్షలు, జరిమానాలు మొదలగువన్నీ కొత్తగా వచ్చిన ఆటగాడికే చెందుతాయని ఎంసీసీ పేర్కొంది.
అది డెడ్బాలే..
కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి జంతువులు గానీ, మనుషులు గానీ వస్తే.. అప్పుడు బౌలర్ వేసిన బంతిని డెడ్ బాల్‌గా పరిగణించాలని ఎంసీసీ తెలిపింది. కట్‌స్ట్రిప్ దాటిన బంతిని బ్యాటర్ టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: బౌన్సర్లను నిషేధించాల్సిన అవసరం లేదు: ఎంసీసీ