పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ (Pakistan vs Afghanistan Series) నిరవధికంగా వాయిదా పడింది. అఫ్గాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు క్రికెటర్ల మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈఓ హమీద్ షిన్వారీ ప్రకటించారు. ఈ సిరీస్‌ను 2022లో తిరిగి నిర్వహించనున్నట్లు ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.
అంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో (పీసీబీ) జరిగిన సమావేశంలో ఈ సిరీస్ ఆడటానికి అఫ్గాన్ బోర్డు (ఏసీబీ) అంగీకరించింది. శ్రీలంక తటస్థ వేదికగా సెప్టెంబర్ 3నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయని ఇరుజట్లు వెల్లడించాయి. మరుసటి రోజే ఏసీబీ ఈ విషయంలో వెనకడుగు వేసింది. సిరీస్ సమయానికి తమ ఆటగాళ్లు సన్నద్ధం కాలేరని, తమ దేశంలో పరిస్థితులు అనుకూలంగా లేవని, విమాన రాకపోకలు కూడా నిషేధించబడ్డాయని.. కారణాలుగా వెల్లడించింది.
"అఫ్గాన్‌లో నెలకొన్న పరిస్థితులతో పాటు ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఈ సిరీస్‌ను వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ సిరీస్‌ను తిరిగి 2022లో నిర్వహించాలనుకుంటున్నాం."
-హమీద్ షిన్వారీ, ఏసీబీ సీఈఓ.
తాలిబన్ల పాలనలో క్రికెట్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదని షిన్వారీ అంతకుముందు ప్రకటించారు. వారు ఆటకు పూర్తి మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
"అఫ్గాన్ క్రికెట్ బోర్డుతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఇరుజట్ల మధ్య తొలి ద్వైపాక్షిక సిరీస్ జరగాలని అనుకున్నాం. వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిరీస్‌ను వాయిదా వేయడానికి ఒప్పుకున్నాం. 2023 ప్రపంచకప్‌కు ముందు ప్రాక్టీస్‌లో భాగంగా ఈ సిరీస్ జరగాలని కోరుకుంటున్నాం."
-జకీర్ ఖాన్, పీసీబీ డైరెక్టర్.
ఇదీ చదవండి: అప్పటి ప్రవర్తనకు మాజీ క్రికెటర్ క్షమాపణలు!