న్యూజిలాండ్‌తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో భయపడకుండా ఆడాలనుకుంటున్నట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(cheteshwar pujara news) వెల్లడించాడు. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్ పర్యటనలోనూ ఇలాగే ఆడానన్నాడు. గురువారం నుంచి కాన్పూర్‌లో తొలి టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తాజాగా వర్చువల్‌గా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు పుజారా. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఆటతీరుపై స్పందించాడు.
"ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో నా ఆలోచనా విధానం మరోలా ఉంది. అప్పుడు నేను ఏమాత్రం భయంలేకుండా ఆడాను. అప్పుడు నా బ్యాటింగ్‌లో చేసుకున్న టెక్నికల్ మార్పులేమీ లేవు. ఇక రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌కు నా సన్నద్ధం బాగుంది. ఇంగ్లాండ్‌లో భయంలేకుండా ఎలా ఆడానో ఈ సిరీస్‌లోనూ అదే విధంగా ఆడాలనుకుంటున్నా."
-పుజారా, టీమ్ఇండియా క్రికెటర్
Cheteshwar Pujara on his Centuries: అనంతరం రెండేళ్లకుపైగా శతకం సాధించకపోవడంపై మాట్లాడుతూ.. దాని గురించి ఆలోచించడం లేదన్నాడు పుజారా. "నేను 50, 80, 90 పరుగులు సాధిస్తున్నా. సెంచరీ మాత్రం చేయట్లేదు. కానీ దాని గురించి అయితే నేను ఆలోచించట్లేదు. జట్టుకు ఉపయోగపడే పరుగులు సాధించడమే అసలైన సంతృప్తి. అది నేను చేస్తున్నా. అలాంటప్పుడు శతకాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు" అని తెలిపాడు పుజారా.