Capetown Pitch ICC Rating : గత కొద్ది రోజులుగా అటు సౌతాఫ్రికా ప్లేయర్లు ఇటు టీమ్ఇండియా స్టార్స్ నోట్లో నానుతున్న వివాదాస్పద కేప్‌టౌన్ న్యూలాండ్స్ పిచ్‌కు తాజాగా ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బోర్డు - రెండో టెస్టుకు ఉపయోగించిన పిచ్ నాసిరకంగా ఉందంటూ పేర్కొంది. దీంతో నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా క్రికెట్‌ను మందలిస్తూ ఆ పిచ్‌కు ఓ డీమెరిట్ పాయింట్ విధించింది. ఈ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ నివేదిక ప్రకారమే ఈ తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో భాగంగా రిఫరీ క్రిస్ బ్రాడ్ పిచ్‌కు 'అసంతృప్తికరం' అని రేటింగ్ ఇచ్చాడు.
"న్యూలాండ్స్‌లోని పిచ్‌లో బ్యాటింగ్ చేయడానికి కష్టంగా మారింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాల్ భయంకరంగా బౌన్స్ అయింది. దీంతో షాట్లు ఆడేందుకు చాలా కష్టమైంది. బౌన్స్ కారణంగానే వికెట్లు కూడా ఎక్కువగా నేలకూలాయి" అని బ్రాడ్ పేర్కొన్నారు.
వాస్తవానికి భారత్ - సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఈ పిచ్ పై క్రికెట్ అనలిస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిగా పేస్ బౌలింగ్‌కు అనుకూలించిన ఈ పిచ్ పై తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా జట్టు 55 పరుగులు మాత్రమే సాధించి కుప్పకూలింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమ్ఇండియా 153 పరుగులు సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా టీమ్ మార్‌క్రమ్ 172 పరుగులతో చెలరేగాడు. 79 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది.
అయితే ఈ మ్యాచ్ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ పిచ్ పై పరోక్షంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమకు ఇలాంటి పిచ్‌లపై ఆడటానికి ఇబ్బందేమీ లేదని, అయితే ఇక నుంచి ఇండియాలో మొదటి రోజు నుంచే స్పిన్ అయ్యే పిచ్‌లు ఎదురైనా విమర్శించకూడదంటూ వ్యాఖ్యానించాడు.
'భారత్ పిచ్‌లపై మాట్లాడే వారు నోరు మూసుకోవాలి- మా వద్ద బంతి తిరిగితే ఒప్పుకోరా?'