Bumrah T20 Worldcup: ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2022కు ముందు టీమ్ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. గాయం కారణంగా ఆసియా కప్ 2022కు దూరమైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్‌కు కూడా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రా.. బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో వారం రోజులు ఉండి చికిత్స తీసుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకుని ముంబయి చేరుకున్నట్లు సమచారం.
"బుమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. అతడి ఫిజియోలతో నిరంతరం మేము టచ్‌లో ఉన్నాం. బుమ్రా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆడుతాడని మేము భావిస్తున్నాం. అయితే అతడు టీ20 ప్రపంచకప్‌కు మాత్రం కచ్చితంగా అందుబాటులో ఉంటాడు" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు టీ20ల సిరీస్ నిమిత్తం ఆసీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అనంతరం అదే నెలలో దక్షిణాఫ్రికా జట్టు కూడా ఐదు టీ20ల సిరీస్ కోసం భారత గడ్డపై అడుగు పెట్టనుంది.
ఇవీ చదవండి: బ్యాట్ తగిలి మాజీ క్రికెటర్ విలవిల, వీడియో వైరల్