ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓటమి తర్వాత బీసీసీఐలో మార్పు కనిపిస్తోంది! ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ఒప్పించే పనిలో నిమగ్నమైందని సమాచారం.
సాధారణంగా ఎక్కడ పర్యటించినా.. అక్కడి ఫస్ట్‌క్లాస్ జట్లతో సన్నాహక మ్యాచులు ఆడటం సంప్రదాయం. అన్ని జట్లు ఇలాగే చేస్తాయి. కానీ కరోనా మహమ్మారి వల్ల వీలవ్వడం లేదు. పర్యాటక జట్లు క్వారంటైన్‌లో ఉండటం.. ఆ తర్వాత రెండు జట్లు బయో బుడగలో ఉండాల్సి వస్తోంది. మ్యాచుల నిర్వహణ కష్టంగా మారుతోంది. అందుకే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల ముందు కూడా సన్నాహక మ్యాచులు ఏర్పాటు చేయలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలవ్వడం, ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఎందుకు పెట్టలేదో తమకూ తెలియదని విరాట్ కోహ్లీ అనడం వల్ల బీసీసీఐ మనసు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఈసీబీ ఛైర్మన్ ఇయాన్ వాట్‌మోర్, సీఈవో టామ్ హ్యారిసన్‌తో సన్నాహక మ్యాచుల గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడారని తెలిసింది. ఇప్పటికే ఈసీబీకి బీసీసీఐ అధికారిక విజ్ఞప్తి చేసిందని సమాచారం. రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుందని అంటున్నారు.
వాస్తవంగా నార్తాంప్టన్ షైర్, లీసెస్టర్‌షైర్‌తో మ్యాచులు ఆడేందుకు భారత్-ఏ ఇంగ్లాండ్‌కు రావాల్సింది. అలా వచ్చిన భారత్-ఏతో కోహ్లీసేన సన్నాహక మ్యాచులు ఆడేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కరోనా పరిస్థితులు, ప్రయాణ ఆంక్షలు, బయో బుడగల భారం వల్ల ఆ మ్యాచులు రద్దయ్యాయి. దాంతో దుర్హమ్‌లో సాధన శిబిరం ఏర్పాటు చేశారు. మూడు వారాల విరామం తర్వాత టీమ్‌ఇండియా అక్కడికి చేరుకుని సాధన చేయాల్సి ఉంది.
ఇప్పుడు ఈసీబీ సన్నాహక మ్యాచులు గనక ఏర్పాటు చేస్తే కోహ్లీసేన విరామం రద్దయ్యే అవకాశం ఉంది. కాగా, బ్రిటన్‌లో డెల్టా, డెల్టా ప్లస్ కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారేలా ఉందని తెలిస్తే మాత్రం.. ఆటగాళ్లను శిబిరానికి వచ్చేయమని చెబుతారు. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధుమాల్ ఆ దిశగా సంకేతాలిచ్చారు.
ఇవీ చదవండి: