BCCI Review : ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రదర్శన అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి, సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడాన్నే జీర్ణించుకోలేకపోతుంటే.. తాజాగా బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుకు వన్డే సిరీస్‌ను కోల్పోవడం పెద్ద షాక్. టీమ్‌ఇండియా ఇలా చిత్తవుతుంటే.. బీసీసీఐ ఏం చేస్తోందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ పర్యటన పూర్తి కాగానే బీసీసీఐ కార్యవర్గం.. జట్టు యాజమాన్యం, ప్రధాన ఆటగాళ్లు, సహాయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవలి పరాభవాలపై వివరణ కోరడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శన, సెలక్షన్ తదితర అంశాలపై సమీక్ష చేపట్టనున్నట్లు సమాచారం. "ప్రపంచకప్ ముగియగానే సమీక్ష నిర్వహించాలనుకున్నాం. కానీ కొందరు ఆఫీస్ బేరర్లు అందుబాటులో లేకపోవడంతో ఆ సమావేశం వాయిదా పడింది. బంగ్లాదేశ్ నుంచి జట్టు స్వదేశానికి రాగానే సమీక్ష ఉంటుంది" అని ఒక బీసీసీఐ అధికారి తెలిపాడు.