BCCI Tender For Media Rights : భారత క్రికెట్ బోర్డు తమ ఆదాయం సమకూర్చుకునే విషయంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో స్పాన్సర్‌షిప్ హక్కుల టెండర్లకు ఆహ్వానాలు పలికి ఒక్క రోజు గడువక ముందే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు మీడియా హక్కులు ఇచ్చేందుకు సిద్ధపడింది. రానున్న కొద్ది నెలల్లో వన్డే వర్డల్ కప్ సమీపిస్తున్నందున వేళ.. మీడియా హక్కుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతే కాకుండా 'ఇన్విటేషన్ టు టెండర్'లో దీనికి సంబంధించిన వివరాలతో పాటు షరతులు స్పష్టంగా వెల్లడించింది.
BCCI Tender Media Rights : ఇందులో భాగంగా దరఖాస్తులు వేసేందుకు ఆసక్తిగల మీడియా సంస్థలు జీఎస్టీతో కలిపి రూ. 15 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో పాటే అర్హతలు, బిడ్స్ వేయడం, హక్కులు, అభ్యంతరాలు లాంటివన్నీ టెండర్ ప్రక్రియలో భాగమంటూ బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఐటీటీ ఆగస్టు 25వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందంటూ తెలిపింది.
"ఆసక్తిగల కంపెనీలు తప్పనిసరిగా ఐటీటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే.. అన్ని విధాలుగా అర్హులైన వాళ్లకు మాత్రమే ఈ బిడ్ వేసేందుకు ఎంపిక చేస్తాం. అయితే ఐటీటీ కొన్నంత మాత్రాన బిడ్ వేయచ్చని అనుకోవద్దు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేసేందుకు సర్వ అధికారాలు బీసీసీఐ వద్ద ఉన్నాయి" అంటూ ఆ ప్రకటనలో బీసీసీఐ స్పష్టంగా తెలిపింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ కోట్లలో గడించిన విషయం తెలిసిందే.
బీసీసీఐకి కాసుల పంట..
BCCI Revenue Share In ICC : అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి- బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి- ఐసీసీ నుంచి రావాల్సిన షేర్ గణనీయంగా 72 శాతం పెరిగింది. దీంతో ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల (231 మిలియన్ డాలర్లు) దాకా అందుకోనుంది. ఈ కొత్త రెవెన్యూ మోడల్‌కు ఐసీసీ ఆమోదం తెలిపినట్లు.. బీసీసీఐ కార్యదర్శి జై షా రాష్ట్ర క్రికెట్ అసోషియేషన్లతో పంచుకున్నారు.
BCCI ICC Revenue Share : ఈ కొత్త రెవన్యూ మోడల్ ప్రకారం.. ప్రతి ఏడాది ఐసీసీ నుంచి బీసీసీఐకి 38.5 శాతం వాటా దక్కనుంది. 'దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన సమావేశంలో ఈ కొత్త రెవెన్యూ విధానానికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. బీసీసీఐకి ఇప్పటివరకూ 22.4 శాతం వాటా దక్కేది. అయితే, ఇప్పుడు అది గణనీయంగా 72 శాతం పెరిగి 38.5 శాతానికి చేరింది. ఇది రాష్ట్ర సంఘాలు, బీసీసీఐలోని అందరి కృషి వల్లే సాధ్యమైంది'అని జై షా రాష్ట్ర అసోషియేషన్లకు సమాచారం అందించినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది.