Bangladesh Team Worst Record: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఆంటిగ్వాలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 32.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. కరీబియన్ బౌలర్ల ముందు బంగ్లాదేశ్ బ్యాటర్లు తేలిపోయారు. ఆ జట్టులోని ఏకంగా ఆరుగురు బ్యాటర్లు ఒక్క పరుగు చేయకుండానే డకౌట్ అయ్యి పెవిలియన్‌కు చేరారు.
కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాత్రమే 51 పరుగులు చేసి తన జట్టుకు కాస్త స్కోరును అందించాడు. బంగ్లాలో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్లలో ముగ్గురు టాప్ఆర్డర్ బ్యాటర్లు ఉండడం గమనార్హం. మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ శాంటో, మోమినుల్ హక్ వంటి అగ్రశేణి ఆటగాళ్లతో పాటు నురుల్ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీద్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, జైడెన్ తలో 3 వికెట్లు తీయగా.. కీమర్ రోచ్, కైల్ మేయర్స్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు.
3 సార్లు బంగ్లానే.. ఈ ఏడాది మే 23న శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ ఇలాంటి చెత్త రికార్డే నమోదు చేసింది. మీర్పుర్ వేదికగా జరిగిన ఆ టెస్ట్‌లోనూ ఆరుగురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. నెల తిరగకుండానే మరోసారి ఇలాంటి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ఓ సారి కూడా ఒక మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా ఏడుసార్లు జరగ్గా.. అందులో మూడు సార్లు బంగ్లాదేశ్ ఉంది.
ఇవీ చదవండి: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ అంధ క్రికెటర్ వరల్డ్ రికార్డ్
'నన్ను ఒంటరి చేసి హింసించారు'.. మాజీ కోచ్‌పై మరో సైక్లిస్ట్ ఆరోపణలు