T20 World Cup: టీ20 ప్రపంచకప్ సూపర్ - 12 పోరులో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడేసింది. రెండింట్లోనూ విజయాలను నమోదు చేసింది. ఇక మూడు మ్యాచ్‌లు మిగిలిఉండగా.. అందులో భాగంగా ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక పోరులో టీమ్‌ఇండియా తలపడనుంది. సఫారీల జట్టుతో ఇటీవల సిరీస్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాపై ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా ఓటమి తప్పదు. ఆ జట్టులో బ్యాటర్లు క్వింటన్ డికాక్, డేవిల్ మిల్లర్, రోసౌవ్, మార్‌క్రమ్ వంటి ప్రమాదకర బ్యాటర్లు ఉన్నారు. అలాగే నోకియా, రబాడ, జాన్‌సెన్, పార్నెల్ కీలక బౌలర్లు. అయితే దక్షిణాఫ్రికాతో కీలకమైన మ్యాచ్‌పై టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్పందించాడు.
"మేం తప్పకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొంటాం. బౌన్సీపిచ్ అని కంగారు పడకుండా మా బ్రాండ్ క్రికెట్‌ను ఆడతాం. ఆ జట్టులో పేసర్లు ఆన్రిచ్ నోకియా, కగిసో రబాడ వంటి ఉన్నారేమో.. మాకు విరాట్ భాయ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక నేను గత మ్యాచ్‌లో వికెట్ తీయడానికి ఇబ్బంది పడినా.. నెదర్లాండ్స్‌పై రాణించడం ఆనందంగా ఉంది. అయితే ఒక్కోసారి బౌలర్‌గా, బ్యాటర్‌గా ప్రత్యర్థులు అవకాశాలు తీసుకొని విజయవంతం అవుతుంటారు. పాక్ మ్యాచ్‌కు సంబంధించి బౌలింగ్ వీడియోను మా కోచ్‌తో కలిసి చూశా. అయితే ఒక్క బాల్ మినహా అన్ని బంతులు లైన్ అండ్ లెంగ్త్ బాగానే వేశా. ఇవాళ కూడా అలానే జరిగింది. అయితే వికెట్లు దక్కాయి. మా మొదటి ఆరుగురు బ్యాటర్లు కుడిచేతివాటం కలిగిన ఆటగాళ్లు. అందుకే నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకైనా సిద్ధంగా ఉంటా" అని అక్షర్ పటేల్ వెల్లడించాడు.