David Warner Retirement: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే క్రికెట్‌లో ఓ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని సూచన ప్రాయంగా వెల్లడించాడు. తాజాగా జరిగిన ప్రైవేట్ షోలో వార్నర్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వస్తే.. మొదటగా అది టెస్ట్ క్రికెట్ అవుతుందని, బహుశా సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో ఏడాది పాటు కొనసాగుతానని, టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌పై సంకేతాలు ఇచ్చాడు.
మరోవైపు వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం 2024 టీ20 వరల్డ్‌కప్ వరకు కొనసాగుతానని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగే అంశంపై తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు. వార్నర్ టెస్ట్‌ల్లో మరో ఏడాది కొనసాగితే.. ఈ మధ్యలో భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (2023 ఫిబ్రవరి, మార్చి), ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ (2023 జూన్, జులై)లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
కాగా, 36 ఏళ్ల వార్నర్.. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా కూడా పేలవ ప్రదర్శన కనబర్చి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. గత దశాబ్ద కాలంగా ఆసీస్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న వార్నర్.. 96 టెస్టులు, 138 వన్డేలు, 99 టీ20లు ఆడి, దాదాపుగా 17,000 పరుగులు సాధించాడు. ఇందులో 43 శతకాలు, 84 అర్ధశతకాలు ఉన్నాయి.