టీ20 ప్రపంచకప్ గెలిచి విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మూడు రోజుల వ్యవధిలోనే వన్డేల కోసం ఆసీస్‌లో పర్యటించనుంది. ఇంత తక్కువ విరామంతో మ్యాచులు ఆడడమే కష్టమంటే అందులో వంద శాతం ప్రదర్శన ఆశించడం దారుణమంటూ జట్టులో కొందరు మండిపడుతున్నారు. ఆ జట్టు ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఈ క్రికెటర్ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విమర్శలు గుప్పించాడు. భారత టీ20 లీగ్ కోసం ఉత్సాహంగా బయలుదేరతారు కానీ దేశం కోసం ఆడలేరా? అంటూ ప్రశ్నించాడు. ఇంగ్లిష్ ఆటగాళ్లు ఇలాంటి ఫిర్యాదులకు ముగింపు పలకాలన్నాడు.
"అంతర్జాతీయ షెడ్యూల్‌పై ఆటగాళ్లు ఇటువంటి ఫిర్యాదులు చేయడం సరికాదు. ఆరు నుంచి ఎనిమిది వారాలు పాటు వీరికి విశ్రాంతి లభిస్తుంది. కానీ డబ్బుల కోసం దేశీయ, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడేందుకు అంగీకరిస్తారు. ఇవన్నీ ఆడుతూ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉండటం ఎలా వీలవుతుంది. ఒకవేళ ఇదే భారత టీ20 లీగ్ కోసం వెళ్లాల్సి వస్తే మాత్రం విమానం ఎక్కేందుకు వెంటనే సిద్ధమైపోతారు. ఆ సమయంలో మాత్రం వీరి నుంచి ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు" అంటూ మైఖేల్ విమర్శించాడు.