AUS VS PAK: సొంత గడ్డపై పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో బాగానే ఆడిన చేసుకున్న పాక్ జట్టు.. లాహోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మాత్రం చేతులెత్తేసింది. ఆసీస్ చేతిలో 115 పరుగుల తేడాతో భారీ పరాభవాన్ని ఎదుర్కొంది. మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగియడం వల్ల ఈ సిరీస్‌ను 1-0 ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో 24 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టు టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2016 తర్వాత ఆస్ట్రేలియాకు విదేశీ గడ్డపై ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం.
351 పరుగుల లక్ష్యంతో 76/0తో ఐదో రోజు ఆటను పాక్ ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోరుతో దిగిన బ్యాటర్లు అబ్దుల్లా షఫీక్, అజహర్ అలీ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఇమాముల్ హక్ (70), సారథి బాబర్ అజామ్ (55) జట్టును ఆదుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మ్యాచ్‌ను డ్రాగా ముగించేలా పాక్ బ్యాటర్లు కనిపించారు. అయితే బంతిని అందుకున్న నాథన్ లైయన్.. క్రీజులో పాతుకుపోయిన ఇమాముల్ హక్, అజామ్‌ల వికెట్లను తీశాడు. వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీ విరామం వరకు పాక్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయింది. మరో సెషన్ ఆడి ఉంటే.. మ్యాచ్ డ్రాగా ముగిసేది. అయితే లైయన్, ప్యాట్ కమిన్స్ అద్భుత బౌలింగ్‌తో పాక్.. టీ విరామం తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోయింది. 235 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక, ఈ విజయంతో ఆసీస్ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2021-23 పట్టికలో 72 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
ఇదీ చదవండి: ఐపీఎల్లో ధారాళంగా పరుగులు ఇచ్చిన మేటి బౌలర్లు!