Asia cup 2023 virat kohli : టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ 9 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ 2023లో ఆడనున్నాడు. విరాట్ చివరిసారిగా 2014 ఆసియా కప్‌లో ఆడాడు. ఆ తర్వాత జరిగిన 2016 ఎడిషన్‌లో కోహ్లీకి చోటు లభించలేదు. ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌నకు ముందు 2018లో జరిగిన ఆసియా కప్ ఎడిషన్‌లో విశ్రాంతి తీసుకున్నందున కోహ్లీ ఆడలేదు. దీంతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరగనున్న ఆసియా కప్ కోసం.. తొమ్మిదేళ్ల తర్వాత మొదటిసారి ఆడనున్నాడు. దీంతో కోహ్లీ ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటి వరకు ఆడిన ఆసియా కప్‌ల్లో విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌లలో 61.3 సగటుతో 613 పరుగులు చేశాడు. అందులో 183 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఏసీసీ టోర్నీలో ఇప్పటి వరకు ఒక అర్ధసెంచరీ, 3 సెంచరీలు సాధించాడు. దీంతో ఆగస్టులో ప్రారంభమవనున్న ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Asia Cup 2023 : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య మాటల యుద్ధం సాగడం వల్ల ఆసియా కప్ నిర్వహణపై మొదట సందిగ్ధత నెలకొంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడం.. ఆ తర్వాత తమ టీమ్ కూడా భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని పీసీబీ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్ మోడల్‌ను పాక్ ప్రతిపాదించింది.
అయితే హైబ్రిడ్ మోడల్‌పై అసియా క్రికెట్ మండలి (ఏసీసీ) సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ సంబంధాలు, భద్రత కారణాల దృష్ట్యా.. టీమ్ఇండియా శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడనుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. దీంతో మరోసారి భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్ జరగనుంది.