131 ఏళ్ల షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ప్రస్తుత సీజన్లో ఓ బ్యాటర్ అత్యంత జిడ్డు బ్యాటింగ్ ఆడి ఆకట్టుకున్నాడు. షీల్డ్ 2022-23 ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విక్టోరియా ప్లేయర్ ఆష్లే చంద్రసింఘే.. 403 నిమిషాల పాటు క్రీజులోనే నిలబడి రికార్డుకెక్కాడు. ఆచితూచి ఒక్కో బంతిని ఎదుర్కొన్నాడు. మొత్తంగా 280 బాల్స్‌ను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో.. షీల్డ్ టోర్నీలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 1997-98 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్మానియా ప్లేయర్ జేమీ కాక్స్ కూడా ఇలాంటి ప్రదర్శనే చేశాడు. 267 బాల్స్‌ను ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచి ఆకట్టుకున్నాడు.
అయితే ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరి కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే షీల్డ్ ఫైనల్లో కనీసం అర్ధ శతకం కూడా చేయకుండా చివరి వరకు క్రీజులో నిలబడిన ఓపెనర్‌గానూ ఘనత సాధించాడు. 16.43 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన చంద్రసింఘే.. ఫస్ట్ రన్ చేసేందుకు ఏకంగా 49 బంతులను తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలా పలు రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
దీంతో చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కొంతమంది క్రికెట్ అభిమానులు అతడిని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. చంద్రసింఘే సహనంగా క్రీజులో ఉండి ఆడిన విధానాన్ని.. టెస్ట్ క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. కాగా, శ్రీలంక మూలాలు ఉన్న చంద్రసింఘే ఆస్ట్రేలియన్ క్రికెటర్. అతడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. మైక్ హస్సీల, కుమార సంగక్కరను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్ కెరీర్‌ను ఎంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 2022లో సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లోనూ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గానూ మెరిశాడు. నాథన్ లయన్ రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చాడు.
ఇకపోతే ఈ షీల్డ్ ఫైనల్లో మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి విక్టోరియా 2 పరుగుల ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ టీమ్ 195 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 122 రన్స్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇదీ చూడండి: ధోనీ తన కెరీర్లో ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో తెలుసా?