Alex carey test debut: మరో వారంలో యాషెస్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్‌గా టిమ్‌పైన్ స్థానంలో అలెక్స్ క్యారే ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 45 వన్డేలు, 38 టీ20లు ఆడిన క్యారే తొలిసారి టెస్టు క్రికెట్ ఆడనున్నాడు. ఈనెల 8న గబ్బా వేదికగా జరిగే బ్రిస్బేన్ టెస్టులో అతడు అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. టిమ్‌పైన్ గతనెల అసభ్యకర సందేశాలు పంపిన వివాదంలో చిక్కుకొని కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే, ఆటగాడిగా కొనసాగుతానని చెప్పిన అతడు కొద్ది రోజుల క్రితం విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈ నేపథ్యంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా రాణిస్తున్న క్యారేను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో అతడి పేరును ప్రకటించింది. మరోవైపు టిమ్‌పైన్ కెప్టెన్‌గా తప్పుకోవడం వల్ల ప్యాట్ కమిన్స్‌ను నూతన సారథిగా ఎంపిక చేసింది. అతడికి స్టీవ్‌స్మిత్ వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తాడు. ఇక టెస్టు క్రికెట్‌కు తొలిసారి ఎంపికైన క్యారే స్పందిస్తూ.. "యాషెస్ సిరీస్‌లాంటి గొప్ప పోరులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు. తొలి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని" చెప్పాడు.
ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మైఖేల్ నాసర్, రిచర్డ్‌సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్కార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్
ఇదీ చూడండి: RCB Captain 2022: 'వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్ అతడే.. కానీ!'