Arshin Kulkarni Cricketer : టీమ్ఇండియా ప్లేయర్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో బంతిని బౌండరీ దాటించే ఈ స్టార్ ప్లేయర్ బౌలింగ్‌లోనూ అదరగొడతాడు. అలా తన ఆల్‌రౌండింగ్ స్కిల్స్‌తో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ఇప్పుడు అచ్చం అలాంటి పోలికలతోనే ఉన్న ఓ ప్లేయర్ తన సత్తా చాటుతూ దుసుకెళ్తున్నాడు. అతడు ఎవరో కాదు మహారాష్ట్ర యంగ్ స్టార్, టీమ్ఇండియా అండర్-19 ప్లేయర్ అర్షిన్ కులకర్ణి. ప్రస్తుతం అండర్-19 ఆసియాకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ స్టార్ క్రికెటర్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.
ఆల్‌రౌండ్ స్కిల్స్‌తో పాటు కెప్టెన్సీ పరంగానూ అకట్టుకుంటున్నాడు. దుబాయ్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కులకర్ణి సత్తా చాటాడు. బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టి అలాగే బ్యాటింగ్‌లోనూ 70 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. భారత్‌కు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందించాడు.
నాన్న కలను నెరవేర్చేందుకు
అర్షిన్ తండ్రి అతుల్ కులకర్ణి వృత్తి రీత్యా వైద్యుడు. ఆయన కూడా క్రికెటర్ అయ్యేందుకు అన్ని విధాల ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల విఫలమయ్యారు. అయితే తన కలను కొడుకు రూపంలో నెరవేర్చకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా తన తనయుడికి చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో పలు మెళకువలు నేర్పించాడు.
తొలుత షోలాపూర్‌లో శిక్షణ పొందిన అర్షిన్కు ర్వాత మహారాష్ట్ర అండర్-14 జట్టులో చోటు దక్కంది. దీంతో ఇక ఫ్యామిలీతో సహా అర్షిన్ పుణెకు వచ్చేశాడు. అక్కడి కాడెన్స్ అకాడమీలో శిక్షణ పొంది తనను తాను మరింత మెరుగుపరుచుకున్నాడు.
ఓ వైపు క్రికెట్‌లో కొనసాగుతూనే చదువుకున్నాడు. వారానికి నాలుగు రోజులు షోలాపూర్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు వెళ్లేవాడు. ఆ తర్వాత వినూ మన్కడ్ ట్రోఫీలో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. అలా మహారాష్ట్ర సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లోనూ దుమ్మురేపాడు. ఈ క్రమంలో సెలక్టర్ల దృష్టిలో పడి భారత అండర్-19 ఆసియాకప్ జట్టుకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా జట్టు పగ్గాలును కూడా అందుకున్నాడు.