ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసేది వన్డే ప్రపంచ కప్ కోసమే. అక్టోబరు-నవంబరులో జరగనున్న ఈ భారీ పోరు ఆరంభమయ్యేందుకు మరీ ఎక్కువ సమయమేమీ లేదు. ఇక జట్లన్నీ ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టేందుకు అన్ని రకాలుగా సంసిద్ధమవుతున్నాయి.
మరోవైపు శుక్రవారం నుంచి కంగారు జట్టుతో రోహిత్‌సేన వన్డే సిరీస్ ఆడబోతోంది. అయితే టీమ్‌లోని ఆటగాళ్లను వరుస గాయాలు వెంటాడుతున్న క్రమంలో.. ఈ విషయం భారత సేనను కలవర పెడుతోంది. ఇటీవలే శ్రేయస్ అయ్యర్ వెన్ను సమస్యతో ఆసీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ షెడ్యూల్లోని కొన్ని మ్యాచ్‌లకు శ్రేయస్ దూరమయ్యే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే శ్రేయస్ ఫిట్‌గా ఉన్నట్లు ఎన్‌సీఏ ప్రకటించిన కొన్ని రోజులకే అతన్ని వెన్ను నొప్పి మరింత బాధించడం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాల నిర్వహణ తీరుపై సర్వత్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇటీవలే గాయాల బారిన పడ్డ క్రికెటర్లు కూడా చాలామంది ఉన్నారు. వెన్ను గాయంతో ఇప్పటికే చాలా కాలం ఆటకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే శస్త్రచిత్స చేయించుకున్నాడు. దీంతో అతను ఇప్పట్లో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం లేదు. తను పూర్తిగా కోలుకునేంత వరకు అసలు ప్రపంచకప్‌లో ఆడడం కూడా అనుమానంగానే ఉంది.
ఇక రవీంద్ర జడేజా కూడా కొద్దిపాటి విరామం తీసుకుని గాయాల నుంచి కోలుకున్న తర్వాత జట్టులోకి పునరాగమనం చేశాడు. దీపక్ చాహర్ కూడా తరచూ గాయాలపాలు కావడం వల్ల జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో గాయాల నిర్వహణపై ఎన్‌సీఏలోని స్పోర్ట్స్ సైన్స్ విభాగం నుంచి బీసీసీఐ సరైన వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆటగాళ్లను రొటేట్ చేసినందుకు విమర్శలు వెల్లువెత్తడం వల్ల.. వన్డే ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో 18-20 మంది ఆటగాళ్లతోనే ఆడతామని సెలక్షన్ కమిటీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ జనవరిలోనే ప్రకటించాయి. కానీ ముఖ్య ఆటగాళ్ల గాయాలతో మెయిన్ టీమ్‌లో ఆడడం ఎలా సాధ్యమన్నదే ఇక్కడ ప్రశ్న. "ఆటగాళ్లపై మేము ఎక్కువ పనిభారం పడనివ్వట్లేదు. అయినప్పటికీ ప్రధాన ఆటగాళ్లు తరచూ గాయాలపాలవుతున్నారు. దీని గురించి బీసీసీఐ.. ఎన్‌సీఏ అధికారులతో చర్చించింది. టీమ్ మేనేజ్మెంట్తో పాటు సెలక్షన్ కమిటీ ఇప్పుడు బ్యాకప్ ఆటగాళ్లను గుర్తించడంపై దృష్టి సారిస్తోంది" అంటూ ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఏడాదికి 30 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న భారత క్రికెటర్ల సంఖ్య కూడా చాలా తక్కువే. అయితే గాయల బారిన పడ్డ ప్లేయర్ల జాబితా ఎందుకు ఇంతా పెద్దదిగా ఉందన్న విషయం బోర్డుకు ఇంకా అంతుపట్టట్లేదు.
ఇదిలా ఉండగా ప్రసిద్ధ్ కృష్ణను ప్రపంచకప్‌కు సిద్ధం చేయాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ప్రస్తుతం అతను అందుబాటులో లేడు. ఇటీవలే వెన్నుకు శస్త్రకిత్స చేయించుకున్న ప్రసిద్ధ్.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆగస్టు (జింబాబ్వేతో వన్డే) తర్వాత అతడు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. రెండో ప్రాధాన్య పేసర్ల విషయంలో కూడా మేనేజ్‌మెంట్‌కు ఇంకా ఓ స్పష్టత లేదు. ఆసియాకప్ తర్వాత జట్టుకు దూరమైన అవేష్ ఖాన్ కూడా రంజీ ట్రోఫీ ఆడుతుండగా గాయాలపాలయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌నకు సన్నద్ధం కావడం టీమ్‌ఇండియాకు పెను సవాలుగా మారనుంది.