వచ్చే నెలలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన(IND Vs SL) ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవలే 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసింది. అందులో ఆరుగురు స్పిన్ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం. జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుండగా.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే ఆయా మ్యాచ్‌ల్లో ఆరుగురు స్పిన్నర్లను ఎలా ఆడిస్తారని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా(Aakash Chopra) తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అది కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan), కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)కు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నాడు.
"ఈ పర్యటనలో ఆరుగురు స్పిన్నర్లు, నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇందులో స్పిన్నర్లను ఎవరు ఎంపిక చేస్తారు? వీరిలో ఎవరిని.. ఎప్పుడు.. ఎలా ఆడించాలనే విషయాలపై కెప్టెన్, కోచ్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాహుల్ చాహర్, యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, క్రునాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకున్నారు. అయితే, ముగ్గురు స్పిన్నర్ల కన్నా ఎక్కువ ఏ మ్యాచ్‌లోనూ ఆడించే అవకాశం ఉండదు. కొన్నిసార్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం కూడా కష్టమవుతుంది. సహజంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. ఇక ఇందులో క్రునాల్ పాండ్య కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడి తర్వాత ఫినిషర్లు లేరు. దాంతో మరో ఇద్దరు స్పిన్నర్లకే అవకాశం ఉంటుంది."
- ఆకాశ్ చోప్రా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అలాగే యుజువేంద్ర చాహల్‌ను వన్డేల్లో కచ్చితంగా ఆడిస్తారని, దాంతో ఆ సిరీస్‌లో గరిష్టంగా ఇంకో స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం ఉంటుందని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండో స్పిన్నర్‌గా కుల్దీప్కు అవకాశమివ్వాలని చెప్పాడు. ఎందుకంటే అతడిని టీ20ల్లో ఆడించే అవకాశం లేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్‌ను ఎందుకు ఎంపిక చేశారని మాజీ బ్యాట్స్‌మన్ సందేహం వెలిబుచ్చాడు.
అయితే, టీమ్‌ఇండియా ఈ పర్యటనలో వివిధ స్పిన్ బౌలింగ్ జోడీలను ప్రయత్నించాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాహల్, కుల్దీప్లను వన్డేల్లో.. వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్‌ను టీ20ల్లో ఆడించే అవకాశం ఉంది. క్రునాల్‌కు తుది జట్టులో ఉండే అవకాశం ఉండటం వల్ల కృష్ణప్పని అదనపు ఆటగాడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఇదీ చూడండి.. WTCFinal: 'ఆ ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలి'