ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు కృషి చేస్తున్నామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ తెలిపారు. ఇందుకు యూఏఈ ప్రభుత్వ అనుమతి అవసరమన్నారు. ఎనిమిది జట్లతో లీగ్ ఆడటం ఇదే ఆఖరి సారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సీజన్ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.
"ఐపీఎల్ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలు టీకాలు వేయించుకోవడం వల్ల యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి! ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం. మిగతాదంతా యూఏఈ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది."
-అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి
పది జట్ల ఐపీఎల్ గురించి ధుమాల్ మాట్లాడారు. "ఇప్పుడందరి చూపూ ఐపీఎల్ మీదే ఉంది. యూఏఈలో ఐపీఎల్ విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం. ఏదేమైనా ఎనిమిది జట్లతో ఇదే చివరి సీజన్. వచ్చేసారి 10 జట్లు ఉంటాయి. మేం దానిపైనా పనిచేస్తున్నాం" అని ఆయన తెలిపారు.
గతంలోనూ లీగ్‌లో పది జట్లు ఉండేవి. 2011లో 10 జట్లతో లీగ్ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఈ ఏడాది డిసెంబర్లో భారీ వేలం ఉండొచ్చని తెలుస్తోంది.
ఇవీ చదవండి: