టెన్నిస్ వెయిట్‌లిఫ్టింగ్, షూటింగ్.. ఒకటి తర్వాత మరొక క్రీడలో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు వస్తున్నా బ్యాడ్మింటన్‌లో మాత్రం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 17 ఏళ్ల సైనా(Saina Nehwal) అసాధారణ ప్రదర్శనతో క్వార్టర్స్ వరకు వెళ్లింది. అక్కడ పోరాడి ఓడింది అయితే నాలుగేళ్లు ఆలస్యమైనా లండన్ నుంచి పతకంతో తిరిగొచ్చింది సైనా. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తొలి ఒలింపిక్ పతకం అదే. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరో అద్భుతం. సూపర్ సైనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సింధు రియో ఒలింపిక్స్‌లో(Rio Olympics) రజత పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.
అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన ఆమె, ఆఖరి పోరులో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారీన్(Carolina Marin) చేతిలో ఓడినా.. కోట్ల మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకుంది. రజత పతకంతో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్‌కు మరింత మెరుగైన రికార్డును అందించింది. అక్కడ్నుంచి సింధు వెనుదిరిగి చూడలేదు. కాంస్యాలను రజతాలుగా.. రజతాలను బంగారు పతకాలుగా మార్చడంలో ఘన చరిత్ర కలిగిన సింధు ఇప్పుడు ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని ముద్దాడాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది.
ప్రతిభకు కొదువలేదు..
పురుషుల సింగిల్స్‌లో సరికొత్త ఆశాకిరణం.. సాయి ప్రణీత్(B.Sai Praneeth). ప్రతిభకు కొదువలేకున్నా.. నిలకడ లేకపోవడం వల్ల స్థాయికి తగ్గట్లుగా సాయి ప్రణీత్ ఎదగలేకపోయాడు. 2010 ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిసిన సాయి ఆ తర్వాత కెనడా ఓపెన్ (2016), సింగపూర్ ఓపెన్ (2017), థాయ్‌లాండ్ ఓపెన్ (2017)లలో విజేతగా నిలిచాడు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాయి ప్రణీత్ కెరీర్‌లో అతిపెద్ద ఘనత. ఒలింపిక్స్‌లోనూ సాయి ప్రణీత్ అద్భుతం చేస్తాడన్న అంచనాలు లేకపోలేదు.
పురుషుల సింగిల్స్‌లో 13వ సీడ్ సాయి ప్రణీత్ గ్రూపు దశను దాటడం సులువే. ప్రీ-క్వార్టర్స్‌లో 9వ ర్యాంకర్ లాంగ్ ఆగ్నస్(చైనీస్ తైపీ)తో సాయి తలపడొచ్చు. ఈ గండం దాటితే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ కెంటొ మొమొట (జపాన్) రూపంలో సాయికి పెద్ద అడ్డంకే ఎదురుకానుంది. అయితే ఒలింపిక్స్ లాంటి విశ్వ వేదికపై ఎన్నో సంచనాలు నమోదవుతాయి. అందులో సాయి ప్రణీత్ ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు!
ఫేవరెట్లలో..
2019లో ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తమదైన ముద్ర వేసింది సాత్విక్ సాయిరాజు (Satwiksairaj Rankireddy) - చిరాగ్‌శెట్టి(Chirag Shetty) జోడీ. థాయ్‌లాండ్ ఓపెన్‌లో టైటిల్ సాధించిన సాత్విక్-చిరాగ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుత నంబర్‌వన్ ర్యాంకు జోడీ మినహా మిగతా అందరిపైనా పైచేయి సాధించడం సాత్విక్- చిరాగ్ జంటను ఒలింపిక్స్ ఫేవరెట్లలో ఒకటిగా నిలుపుతుంది. అయితే ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాలంటే సాత్విక్ జోడీ కష్టపడాల్సిందే.
10వ ర్యాంకు జోడీ సాత్విక్- చిరాగ్‌లకు పురుషుల డబుల్స్ గ్రూపు-ఏలో గట్టి పోటీ తప్పకపోవచ్చు. గ్రూపులో ఉన్న మూడు జోడీలు బలమైనవే. ప్రపంచ నంబర్‌వన్ కెవిన్ సుకముల్జో- మార్కస్ (ఇండోనేసియా), మూడో ర్యాంకు జోడీ లీ యాంగ్- వాంగ్ లిన్ (చైనీస్ తైపీ), 18వ ర్యాంకు జంట బెన్ లేన్- సియాన్ వెండీ (ఇంగ్లాండ్)లతో పోరు సాత్విక్- చిరాగ్‌లకు కఠినమైన పరీక్షే.
లక్ష్యం స్వర్ణం
రియో నుంచి టోక్యో వరకు సింధుది(P.V. Sindhu) అద్భుత ప్రయాణం. నాలుగేళ్లలో ఎంతగానో పరిణతి చెందింది. ఆటలో తిరుగులేని స్థాయికి దూసుకెళ్లింది. 2018 బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌తో సహా 2017, 2018, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లపై తనదైన ముద్ర వేసింది. అంతేకాకుండా మహిళల బ్యాడ్మింటన్‌లో సరికొత్త ప్రమాణాల్ని నెలకొల్పింది. ఫిట్‌నెస్‌లో అత్యున్నత స్థాయికి చేరుకుంది. నైపుణ్యం, ఫిట్‌నెస్‌లో మరింత మెరుగైన స్థితిలో ఉన్న సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో స్థాయికి తగ్గట్లు ఆడితే స్వర్ణం ఖాయమే అన్నది విశ్లేషకుల అంచనా. టోక్యోలో సింధు ఆరో సీడ్‌గా బరిలో దిగుతుంది. గ్రూపు-జెలో సింధుతో పాటు 34వ ర్యాంకర్ చెయుంగ్ నాన్ (హాంకాంగ్), 58వ ర్యాంకర్ సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్) ఉన్నారు. వీరిద్దరిని ఓడించి గ్రూపులో అగ్రస్థానంలో నిలవడం సింధుకు కష్టమేమీ కాదు.
ప్రీక్వార్టర్స్‌లో 12వ ర్యాంకర్ మియా బ్లిక్‌ఫెల్డ్(డెన్మార్క్)తో సింధు తలపడొచ్చు. ఆ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్‌ఫైనల్లో అకానె యమగూచి(జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకునే అవకాశముంది. ఒలింపిక్స్ డ్రాలో సింధుకు ఎదురయ్యే మొదటి గట్టి పోటీ ఇదే. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న యమగూచిపైతో (11-7) మెరుగైన గెలుపోటముల రికార్డే ఉండటం ఏడో ర్యాంకర్ సింధుకు అతిపెద్ద సానుకూలాంశం. క్వార్టర్స్ దాటితే సింధు జోరును అడ్డుకోవడం ఎంతటి క్రీడాకారిణికైనా చాలా కష్టం.
ఇదీ చూడండి.. 'స్వర్ణం కోసమే టోక్యో వెళ్తున్నా'