నేటి నుంచి ప్రారంభం కానున్న సింగపూర్ ఓపెన్‌లో సత్తా చాటాలని భారత షట్లర్లు పట్టుదలతో ఉన్నారు. ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ... అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. సింగపూర్ ఓపెన్‌లో రాణించి టైటిల్ సాధించాలనే కసితో బరిలో దిగుతున్నారు.
- సింధు పూర్వవైభవం తెచ్చేనా...
2018 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలవడం మినహా గతేడాది మిగతా టోర్నీల్లో పెద్దగా ప్రభావం చూపలేదు సింధు. ఇండోనేసియా, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా కప్పు గెలవలేకపోయింది. సింగపూర్ ఓపెన్‌లోనైనా సత్తా చాటాలనుకుంటోంది. మహిళల సింగిల్స్‌లో సింధు నాలుగో సీడ్‌గా పోటీకి సిద్ధమవుతోంది. బుధవారం జరగనున్న తొలిరౌండ్లో సైనా...ఇండోనేసియాకు చెందిన లియాని అలెసాండ్రా మయినకితో తలపడనుంది.
- సైనా గట్టి పోటీ...
ఆరో సీడ్ సైనా నెహ్వాల్ తొలిరౌండ్లో లిన్ హొజ్మర్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో తలపడనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండోనేసియా ఓపెన్ టైటిల్ నెగ్గింది సైనా. అనంతరం 'ఆల్ ఇంగ్లండ్'లో క్వార్టర్స్ చేరినా అనారోగ్య కారణాలతో స్విస్, ఇండియా ఓపెన్‌లకు దూరంగా ఉంది. మలేసియా ఓపెన్‌లో ఆడినప్పటికీ తొలిరౌండ్‌లోనే చుక్కెదురైంది.
- క్వాలిఫయర్‌తో శ్రీకాంత్..
పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్... ఇండియా ఓపెన్ ఫైనల్ చేరడంతో 17 నెలల తర్వాత అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్.. మలేసియా ఓపెన్‌లో క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న శ్రీకాంత్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనున్నాడు.
- సాయిప్రణీత్ తొలిరౌండ్లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ కెంటో మొమొటా (జపాన్)తో తలపడనున్నాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ బ్రిస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో పోటీపడనున్నాడు. పారుపల్లి కశ్యప్ మలేసియాకు చెందిన చిమ్ జున్ వీతో ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి, అర్జున్– శ్లోక్ రామచంద్రన్, మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్, మనీషా–అర్జున్, అనుష్క–సౌరభ్ వర్మ జోడీలు బరిలో ఉన్నాయి.