టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu) తీవ్రమైన ఒత్తిడి మధ్య బరిలో దిగనుందని, మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల ఈసారి పతకం సాధించడం అంత తేలిక కాదని మాజీ క్రీడాకారిణి జ్వాలా గుత్తా(Jwala Gutta) అభిప్రాయపడింది.
"సింధు పతకం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నా. కానీ గత ఒలింపిక్స్ కంటే ఈ సారి ఆమెపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి ఆమె మీదే ఉంది. ఆ ఒత్తిడిని ఆమె ఎలా స్వీకరిస్తుందన్న దానిపైనే తన ప్రదర్శన ఆధారపడి ఉంటుంది. కోచ్‌ల విషయంలో సింధు గందరగోళ పరిస్థితుల్లో ఉంది. అందుకే ఒలింపిక్స్‌కు ముందు ఉండాల్సిన నిలకడ లేదు. కరోనా కారణంగా భారత షట్లర్లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ దక్కకపోవడం ఓ పెద్ద ప్రతికూలత. సింధు తన గత మ్యాచ్‌ల వీడియోలు చూసి వ్యూహాలు రచించాలి" అని జ్వాలా వెల్లడించింది.
గోపీకి విరుద్ధ ప్రయోజనాలు!
జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ గోపీచంద్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడని జ్వాల ఆరోపించింది. "సింధు తర్వాత ఎవరూ అంటే సమాధానం లేదు. ఓ సరైన బ్యాడ్మింటన్ విధానాన్ని రూపొందించడంలో విఫలమయ్యాం. సరిపడా నాణ్యమైన కోచ్‌లు మనకు లేరు. ఓ దశలో ఆటగాళ్లకు గుర్తింపు కావాలి. కానీ ఇప్పుడు ఒక్క అకాడమీకే పూర్తి గుర్తింపు దక్కుతోంది. ప్రధాన కోచ్ తన సొంత ప్రైవేటు అకాడమీని నడిపించకూడదు. అందులో జాతీయ శిబిరాన్ని నిర్వహించకూడదు. కానీ 2006 నుంచి అదే జరుగుతోంది. మొత్తం డబ్బు, వనరులు గోపీచంద్‌కే ఇస్తున్నారు. కానీ ఒక్క డబుల్స్ ప్లేయర్‌ను కూడా అతను తీర్చిదిద్దలేకపోయాడు. కాబట్టి అతను ఆ పదవిలో ఉండకూడదు" అని జ్వాల పేర్కొంది.