ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన తెలుగుతేజం పీవీ సింధు...గోపీచంద్ అకాడమీలో విలేకరులతో మాట్లాడింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఎన్నో రోజుల నిరీక్షణకు తెరదించి ఆత్మవిశ్వాసం పెంచినట్లు తెలిపింది.
" ఒలింపిక్స్‌కు మరో 11 నెలల సమయముంది. అంచనాలు భారీగా ఉంటాయని తెలుసు. ప్రపంచ టోర్నీ పతకం ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఒలింపిక్స్‌లో రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతా. ఇక నా లక్ష్యం 2020 టోక్యో ఒలింపిక్సే. అంతకుముందు సూపర్ సిరీస్‌లలో కూడా నెగ్గాలి. మహిళల సింగిల్స్ చాలా మారిపోయింది. ప్రతి టోర్నీ భిన్నంగా సాగుతుంది. ప్రతి క్రీడాకారిణి గట్టి పోటీనిస్తున్నారు. ఒక్కో టోర్నీ తర్వాత క్రీడాకారిణుల శైలి మారుతుంది. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు మార్చుకోవాలి. పరిస్థితులకు తగ్గట్లు ఆటలో మార్పులు చేసుకోవాలి. టాప్-10లో ఉన్న క్రీడాకారిణుల ఆట మరికొరికి తెలుసు. ఒలింపిక్స్ కోసం మరింత కష్టపడి సరికొత్త అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి ".
--పీవీ సింధు, భారత స్టార్ షట్లర్
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత సాధించిన సింధు...మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఈ మెగాటోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన మాజీ ఒలింపిక్ ఛాంపియన్ జంగ్ నింగ్ (చైనా) సరసన చేరింది. ఈ చైనా క్రీడాకారిణి 2001-07 మధ్య ఒక స్వర్ణం, 2 కాంస్యాలు, 2 రజతాలు గెలిచింది. ఇన్నే పతకాలతో సింధు కొనసాగుతోంది.