లాక్‌డౌన్ సమయంలో 8 కిలోల బరువు పెరిగానని.. మళ్లీ మునుపటి ఫిట్‌నెస్ సాధించడానికి చాలా కష్టపడ్డానని భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజు(Satwiksairaj Rankireddy) తెలిపాడు. 8 నెలలుగా ఇంటికి.. అకాడమీకి తప్ప పక్క వీధిలోకి కూడా వెళ్లలేదని చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) కోసం చిరాగ్ శెట్టి(Chirag Shetty)తో కలిసి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు సాత్విక్ వివరించాడు. విశ్వ క్రీడల సన్నాహాలు, పతకం అవకాశాలపై 'ఈనాడు'తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..
అందుబాటులో అన్నీ
ఒలింపిక్స్ సన్నాహం గొప్పగా అనిపిస్తోంది. గతంలో ఎన్నో టోర్నీలకు ముందు సాధన చేశాం. అగ్రశ్రేణి క్రీడాకారులతో పాటు మిగతా వాళ్లంతా ఎవరికి కేటాయించిన షెడ్యూల్‌లో వాళ్లు సాధన చేసేవాళ్లు. ఇప్పుడు ప్రాక్టీస్ ప్రత్యేకంగా ఉంది. ప్రతి ఒక్కరు మాకు సహాయం చేస్తున్నారు. మేం ఆడిన తర్వాతే మిగతా వాళ్లు ఆడుతున్నారు. కోచ్ మథియాస్ బో అధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ జట్టును ఏర్పాటు చేశారు. చీఫ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశంలో వీరంతా పని చేస్తారు. మేమంతా ఒక జట్టుగా ఒలింపిక్స్‌కు సనద్ధమవుతున్నాం. కొన్ని నెలలుగా వేరే టోర్నీలు లేకపోవడం వల్ల ఒలింపిక్స్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. చిరాగ్, నేను మునుపటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం.. ఏకాగ్రతతో ఆడుతున్నాం.
అదొక్కటే ప్రతికూలం
ఒలింపిక్స్‌కు ముందు అంతర్జాతీయ మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే ప్రతికూలాంశం. కరోనా కారణంగా ప్రపంచంలో ఎక్కడా టోర్నీలు జరగట్లేదు. అందరూ సాధన మాత్రమే చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చాలా విరామం వచ్చింది. రెండేళ్లుగా చాలామంది అంతర్జాతీయ టోర్నీలు ఆడలేదు. ఎవరు ఎలా ఆడుతున్నారు? ఫామ్ ఎలా ఉంది? ఎంత ఫిట్‌నెస్‌తో ఉన్నారు? అనే విషయాలు ఏమీ తెలియవు. టోక్యోకు వెళ్లిన తర్వాత అప్పటికప్పుడు వారి సాధన లేదా మ్యాచ్‌లు చూసి ప్రత్యర్థుల ఆటపై ఓ అంచనాకు రావాలి.
అసాధ్యం కాదు
మా నుంచి అందరూ పతకం ఆశిస్తున్నారు. నేను, సాత్విక్ పతకం సాధిస్తామని అంచనాలతో ఉన్నారు. అది మంచిదే. కరోనా కాలంలో ఒలింపిక్స్ జరుగుతుండటం సానుకూలాంశం. అసలు ఒలింపిక్స్ జరగవన్నారు. చాలా బాధగా అనిపించింది. నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడ్డా. అదృష్టవశాత్తు ఒలింపిక్స్ జరగనున్నాయి. విశ్వ క్రీడల్లో పతకం సులువేమీ కాదు. అత్యున్నత స్థాయిలో పోటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు నూటికి నూరు శాతం ప్రదర్శన ఇస్తారు. కాని పతకం సాధించడం అసాధ్యం కూడా కాదు. ఒలింపిక్స్ అనగానే కొందరు ఒత్తిడికి లోనవుతారు. మేం మాత్రం ఒత్తిడి దరిచేరనీయడం లేదు. ఎలాంటి లక్ష్యం పెట్టుకోవట్లేదు. స్వేచ్ఛగా ఆడాలని అనుకుంటున్నాం.