ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత షట్లర్ల ప్రస్థానం నిరాశతో ముగిసింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ సాత్విక్-చిరాగ్ ఓడింది. ఇండోనేసియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 జోడీ మార్కస్ -కెవిన్ టైటిల్ ఎగరేసుకుపోయింది.
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లో ముగిసింది. సాత్విక్‌సాయిరాజ్, రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ద్వయం.. మార్కస్ ఫెర్నాల్డి గిడియాన్- కెవిన్ సంజయ సుకముల్జో జోడి చేతిలో 18-21, 16-21 తేడాతో ఓడిపోయింది.
పోరాడారు..
సాత్విక్-చిరాగ్ తొలి సెట్ ప్రారంభంలో బాగా వెనుకబడ్డారు. ప్రపంచ నంబర్ 1 జోడి వీరిపై 7-1 ఆధిక్యం సాధించింది. ఆ సమయంలో తెలివిగా, పట్టుదలతో ఆడిన భారత జోడీ.. స్కోర్‌ను 17-17తో సమం చేసింది. అయితే మార్కెస్-కెవిన్ జోడీ వెనువెంటనే 3 పాయింట్లు సాధించి తొలిసెట్ కైవసం చేసుకుంది.
రెండో సెట్లో భారత జోడీ.. ఇండోనేసియా ద్వయంతో 6-6, 10-10, 12-12 పాయింట్ల వరకు హోరాహోరీగా పోరాడారు. తరువాత ఒక్కసారిగా విజృంభించిన ప్రపంచ నెంబర్ 1 సీడ్స్ 18-13తో ముందుకు దూసుకుపోయారు. సాత్విక్-చిరాగ్ ఒత్తిడికి లోనవడాన్ని అవకాశంగా తీసుకున్న మార్కెస్- కెవిన్ ద్వయం చివరి 4 పాయింట్లు సాధించి గేమ్‌ను ముగించింది. ఫలితంగా ఈ స్టార్ ద్వయం తమ ఖాతాలో 7వ టైటిల్‌ను చేర్చుకుంది.
ప్రశంసనీయం..
సాత్విక్-చిరాగ్ ద్వయం ఫైనల్లో ఓడినప్పటికీ వారి ఆటతీరు ప్రశంసనీయం. ఓ భారత పురుషుల జట్టు వరల్డ్ టూర్ 750 ఫైనల్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి.
ఈ భారత జోడీ.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరే క్రమంలో.. ప్రపంచ ఛాంపియన్స్ మొహమ్మద్ ఆహ్సాన్-హేండ్ర సెటివాన్ జోడీని ఓడించింది. తరువాత ప్రపంచ 8వ ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్-అండర్స్ స్కారుప్ రాస్ముసేన్, 6వ ర్యాంక్ జోడీ హిరోయుకి ఎండో-యుటా వతనాబేపై సంచలన విజయం సాధించింది.
భారత్‌కు చెందిన పార్థో గంగూలీ - విక్రమ్ సింగ్ ద్వయం చివరిసారిగా 1983 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.
ఇదీ చూడండి: భారత్-బంగ్లాదేశ్: ఈడెన్ టెస్టులో 'గులాబీ బంతి'..!