భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో ఘనత సాధించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు కోసం ఆసియా- ఓసియానియా జోన్ నుంచి సానియా, ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో (ఇండోనేసియా)ను సిఫార్సు చేశారు. ఈ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత క్రీడాకారిణి సానియానే. ఐరోపా- ఆఫ్రికా జోన్ నుంచి అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా), ఎలియోనోరా మొలినారో (లక్సెంబర్గ్).. అమెరికా తరఫున ఫెర్నాండ గోమెజ్ (మెక్సికో), వెరోనికా రాయ్‌గ్‌లు ఎంపికయ్యారు.
మే 1 నుంచి 8 వరకు జరిగే ఆన్‌లైన్ ఓటింగ్‌లో అభిమానులు విజేతల్ని నిర్ణయిస్తారు. నాలుగేళ్ల తర్వాత సానియా ఇటీవలి ఫెడ్ కప్‌లో పునరాగమనం చేయగా.. భారత్ తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ‘‘2003లో తొలిసారి భారత జెర్సీ ధరించి కోర్టులో బరిలో దిగడం మరిచిపోలేని అనుభూతి. 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత టెన్నిస్ విజయాల్లో భాగమైనందుకు గర్వంగా ఉంది. గత నెలలో ఫెడ్ కప్ ఫలితం నా కెరీర్‌లో అత్యుత్తమ ఘనతల్లో ఒకటి. నా ప్రతిభను గుర్తించిన ఫెడ్ కప్ హార్ట్ అవార్డు సెలెక్షన్ ప్యానెల్‌కు కృతజ్ఞతలు’’ అని సానియా తెలిపింది.