ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో... 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించి పతకం తెచ్చాడు సాయి ప్రణీత్. సెమీస్‌లో పోరాడి ఓడినా కాంస్యంతో దేశ గౌరవాన్ని పతాకస్థాయికి చేర్చాడీ తెలుగు క్రీడాకారుడు. 1983లో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనె కాంస్యం తెచ్చాడు. అతడి తర్వాత మరోసారి దేశానికి మెడల్ తెచ్చిన యువ క్రీడాకారుడు ప్రణీత్. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరిగిన టోర్నీ తర్వాత విజయదరహాసంతో రాష్ట్రానికి వచ్చిన అతడిని ఈటీవీ భారత్ పలకరించింది.
ఇటీవల ప్రభుత్వం అతడికి అర్జున అవార్డు ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారత దిగ్గజ ఆటగాడు ధ్యాన్‌చంద్ పుట్టినరోజు(ఆగస్టు 29)న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నాడు. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయంపై మాట్లాడిన ప్రణీత్... ఈ ప్రదర్శన భారత పురుష క్రీడాకారుల విజయాలకు ప్రారంభం మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి అంతర్జాతీయ వేదికలపై దీటైన ప్రదర్శనలు తప్పవని హెచ్చరించాడు. సెమీస్‌లో టాప్ సీడ్ మొమొటా మైండ్ గేమ్ ఆడాడని వెల్లడించాడు. కచ్చితంగా ఈ కాంస్య పతకం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుందన్నాడు.