పీవీ సింధు చిరకాల స్వప్నం, అశేష క్రీడాభిమానుల ఉత్కంఠభరిత నిరీక్షణ- రెండూ నిన్న స్విట్జర్లాండ్‌లో ఫలించాయి. వరసగా మూడోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ తుది అంకానికి అర్హత సాధించిన తెలుగు తేజం, ఈసారి గురి తప్పకుండా లక్ష్యం ఛేదించి స్వర్ణం చేజిక్కించుకుంది. రెండేళ్లక్రితం ఇదే వేదికపై తనను ఓడించిన ప్రత్యర్థి నొజోమీ ఒకుహారాను తిరుగులేని ఆటతో ఉక్కిరిబిక్కిరి చేసిన సింధు ధాటిని 21-7, 21-7 తేడాతో ఒడిసిపట్టిన అద్భుత విజయం కళ్లకు కడుతుంది!
ఈ పోటీల్లో అయిదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధుకు క్వార్టర్ ఫైనల్ దశలో రెండో సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ) రూపేణా గట్టిపోటీ ఎదురైంది. ఆ హోరాహోరీ పోరులో తొలుత వెనకబడినా పుంజుకొని కడకు జయభేరి మోగించిన భారత మేటి షట్లర్, సెమీస్‌లో మరింత నిలదొక్కుకుంది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)ను మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకెళ్ళిన సింధుకు నిన్న పట్టిందల్లా బంగారమై కొట్టిన షాట్లెన్నో పాయింట్లు తెచ్చిపెట్టాయి. సిసలైన విజేత తాలూకు ఆత్మవిశ్వాసం ప్రత్యర్థిని ఎలా కకావికలం చేయగలదో నిన్నటి ఏకపక్ష పోటీ సోదాహరణంగా తెలియజెప్పింది!
ఆరు సంవత్సరాల క్రితం పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడి కాంస్యం గెలిచిన సింధు, మరుసటి ఏడాదీ దాన్ని పునరావృతం చేసింది. గత రెండేళ్లుగా చివరి మెట్టుపై తడబడి రజతంతో సరిపుచ్చుకొన్నా, ఈసారి సర్వశక్తులూ కేంద్రీకరించి విశ్వవిజేత హోదాలో స్వదేశానికి తిరిగి వెళ్ళాలన్న పట్టుదల ఆమె ఆటలో ఉట్టిపడింది. ప్రధాని మోదీ చెప్పినట్లు- ఇటువంటి గెలుపు కొన్ని తరాల్ని ఉత్తేజితం చేస్తుంది. 1983లో ప్రకాశ్ పదుకొణె కాంస్యం నెగ్గిన దరిమిలా ఇన్నేళ్లకు మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో పతకం సాధించినవాడిగా సాయి ప్రణీత్ ఒకవంక, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులెవరికీ ఇప్పటిదాకా సాధ్యంకాని పసిడిని కొల్లగొట్టిన సింధు మరోపక్క- తెలుగు తల్లి ముద్దుబిడ్డలుగా యావత్ భారతావని జేజేలందుకుంటున్నారు!
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అయిదు పతకాలు అందుకున్న ఘనత ఇప్పటివరకూ చైనా దిగ్గజం జాంగ్ నింగ్‌కే పరిమితమైంది. ఆ రికార్డును సమం చేసిన ఖ్యాతి నేడు సింధు ఖాతాలో జమపడింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మేటి గురువు గోపీచంద్ శిష్యరికంతో రాటుతేలిన సింధు సహజసిద్ధ ప్రతిభాపాటవాలను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వేదికలపై రజతాలతోపాటు రియో ఒలింపిక్స్‌లో వెండి ప్రదర్శన ఎలుగెత్తి చాటినా- కీలక స్పర్ధల్లో ఆఖరి దశలో విఫలమవుతుందన్న విమర్శలు ఇన్నాళ్లూ వెన్నాడాయి. వాటన్నింటికీ ఒకుహారాపై సింధు నిన్న జరిపిన పదునైన దాడే సరైన సమాధానం.
2013లోనే అత్యంత పిన్నవయస్కురాలైన ఛాంపియన్‌గా నిలిచిన రచనోక్ ఇంతనాన్ (థాయ్‌లాండ్)ని ఈసారి సెమీస్‌లో పరాజయం పాల్జేసిన ఒకుహారా నిర్ణయాత్మక ఫైనల్‌లో ఓ పట్టాన కొరుకుడు పడదన్న అంచనాలు ఒక దశలో భయపెట్టాయి. గత నెలలో ఇండొనేసియా ఓపెన్ పోటీల్లో ఒకుహారాను కంగుతినిపించిన సింధు నిన్నా అదే ఒరవడి కొనసాగించి భారతీయ క్రీడాప్రతిభ వేరెవరికీ తీసిపోదని సగర్వంగా నిరూపించింది!
కొన్నేళ్లుగా చైనా, జపాన్, థాయ్‌లాండ్, స్పెయిన్ ప్రభృత దేశాలనుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారులు విరివిగా పుట్టుకొస్తున్నారు. భారత్‌కు సంబంధించి ప్రకాశ్ పదుకొణె, సయ్యద్ మోడీ, ఆపై గోపీచంద్‌ల తరవాత సైనా, సింధు, శ్రీకాంత్, ప్రణీత్ వంటి ఏ కొన్ని పేర్లో మాత్రమే వినిపిస్తుండటానికి కారణమేమిటి? ప్రజ్ఞాపాటవాలు దండిగా ఉన్నప్పటికీ ముడివజ్రాల్ని గుర్తించి సానపట్టే ప్రణాళికాబద్ధ కృషి దేశంలో కొరవడుతోంది. కుటుంబ నేపథ్యం, రాజకీయ పరిచయాలు, ఆర్థికంగా దన్ను... ఇవేమీ లేని అభాగ్యుల్నీ సమాదరించే వ్యవస్థాగత ఏర్పాట్లు చురుకందుకోవాలేగాని- బ్యాడ్మింటన్ రంగాన మరెన్నో ఆణిముత్యాలు వెలికివస్తాయి.
ఒక్క బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసమే 15వందలకుపైగా ప్రత్యేక శిక్షణాలయాలు అవతరింపజేసిన చైనా- ఆటగాళ్లను శిక్షకులను ఎంపిక చేసేందుకు ఆరంచెల కమిటీని కొలువుతీర్చింది. బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (బీబ్ల్యూఎఫ్) ర్యాంకింగుల జాబితాల్లో బలమైన ఉనికి చాటుకుంటున్న ఇండొనేసియా, డెన్మార్క్, తైపీ, హాంకాంగ్, థాయ్‌లాండ్ తదితర దేశాలూ ఎంపిక, శిక్షణలకు విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. సంపన్న రాజ్యాల్లో క్రీడను పరిశ్రమగా గుర్తిస్తున్నారు. మనకన్నా భౌగోళికంగా, వనరులపరంగా చిన్నవైన ఎన్నో దేశాలూ ఆటలకు ప్రోత్సాహమివ్వడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌కి సంబంధించి అత్యధునాతన వసతులతో కూడిన భారీ శిక్షణాలయాలు, విస్తృత ప్రాతిపదికన సకల సదుపాయాల పరికల్పనకు పకడ్బందీ ఏర్పాట్లు ఆయా దేశాల్లో పెద్దయెత్తున మెరికల్ని తీర్చిదిద్దుతున్నాయని గతంలో సైనా నెహ్వాల్ చేసిన విశ్లేషణ అక్షర సత్యం.
బ్యాడ్మింటన్ క్రీడకు భారతదేశమే పుట్టినిల్లు. అటువంటి చోట వివిధ దశల్లో అన్నీ కలిసొచ్చిన ఏ కొందరో పతకవీరులుగా మిగిలినన్నాళ్లు- ప్రతిష్ఠాత్మక వేదికలపై ఇండియా ప్రాతినిధ్యం ఇతోధికమయ్యే అవకాశం ఏర్పడదు. ఒక్క సింధు, సైనాలనేముంది- సానియా, ఆనంద్, ఉష వంటివారూ కుటుంబ ప్రోత్సాహం, స్వీయ క్రమశిక్షణలతోనే భిన్న క్రీడాంశాల్లో తమదైన ముద్ర వేయగలుగుతున్నారు. భారత్ తరఫున ఏ కొంతమంది వ్యక్తులో తప్ప వ్యవస్థ బలిమి చాటే పరిస్థితి ఇప్పటికీ లేకుండాపోవడం జాతికి శోభస్కరం కాదు.
పాఠ్యపుస్తకాల్లో క్రీడా సంస్కృతిని అంతర్భాగం చేసి- అథ్లెటిక్స్, ఈత వంటి ఇతర క్రీడాంశాల్లోనూ ప్రణాళికాబద్ధంగా శిక్షణ కార్యక్రమం పట్టాలకు ఎక్కడమన్నది, జాతీయ అజెండాగా చురుగ్గా అమలు కావాలి. అటువంటి చొరవే విరివిగా విశ్వవిజేతలు, ఒలింపియన్ల ఆవిర్భావానికి దోహదపడుతుంది!
ఇదీ చూడండి: ఈ పతకం అమ్మకు పుట్టినరోజు కానుక: పీవీ సింధు