ప్రపంచ ఛాంపియన్షిప్ మినహా ఈ ఏడాది ఒక్క టైటిల్‌నూ గెలవలేకపోయింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. ఆ తర్వాత జరిగిన పలు పోటీల్లో వరుస వైఫల్యాలను ఎదుర్కొంది. ఇప్పుడు 'బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్'లో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11నుంచి ఆరంభం కానున్న ఈ టోర్నీలో డ్రా తీయగా సింధు.. కఠినమైన షట్లరున్న గ్రూపులో పడింది.
గ్రూప్-ఏలో చోటు దక్కించుకున్న సింధు.. ఆరంభ మ్యాచ్‌లోనే యమగూచితో(జపాన్)తో తలపడనుంది. అనంతరం చైనా షట్లర్లు చెన్ యూఫీ, హీ బింగ్జీవోతో ఆడనుంది. ప్రపంచ నెంబర్ వన్ తైజు యింగ్(చైనా), మాజీ ప్రపంచ ఛాంపియన్ ఒకుహురా(జపాన్) గ్రూప్-బిలో ఉండటం వల్ల వారిని తప్పించుకోగలిగింది.
చెన్ యూఫీతో సింధు.. ఇప్పటివరకు 9 సార్లు తలపడగా, 6 సార్లు విజయం సాధించింది. యమగూచితో 16సార్లు ఆడగా.. 10 సార్లు గెలిచింది. బింగ్జీవోతో 14 సార్లు తలపడగా.. 9 సార్లు ఓటమి పాలైంది.
దక్షిణ కొరియాలోని గ్వాంగ్జు వేదికగా 'వరల్డ్ టూర్స్ ఫైనల్స్' జరగనుంది. సింధు మినహా మిగతా భారత షట్లర్లు ఎవరూ ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయారు.
ఇదీ చదవండి: సినిమాల్లోకి ధోనీ.. ఆర్మీ నేపథ్య కథతో సిరీస్