కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్‌లో కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో థాయ్‌లాండ్‌కి చెందిన కోసిట్ను 21-11, 21-15 తేడాతో వరస సెట్లలో ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వెనుదిరిగింది.
గత వారం ఇండియా ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్ అదే ఊపును కొనసాగిస్తున్నాడు. కోసిట్తో మ్యాచ్‌ను అరగంటలోనే ముగించడం విశేషం. తర్వాతి రౌండ్లో ఒలింపిక్ ఛాంపియన్.. చైనాకు చెందిన నాలుగో సీడ్ ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడనున్నాడీ తెలుగుతేజం.
ప్రపంచ పదో ర్యాంకర్ కొరియాకు చెందిన సంగ్ జీ హ్యా చేతిలో పరాజయం చెందింది పీవీ సింధు. 18-21, 7-21 తేడాతో ఓడిపోయింది తెలుగమ్మాయి. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్, గత ఏడాది జరిగిన హాంగ్‌కాంగ్ ఓపెన్‌లోనూ సింధు సంగ్ జీ చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.
మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా- సిక్కి రెడ్డి జోడి మలేసియాకు చెందిన టాన్ కియాన్ మెంగ్- లై పే జింగ్ చేతిలో పరాజయం పాలైంది. 21-15 తేడాతో తొలి రౌండ్లో నెగ్గినా... అనంతరం 17-21, 13-21 తేడాతో మ్యాచ్ ఓడిపోయింది