అంతరించిపోతున్న సినిమా హాళ్లను కాపాడాలని నిర్మాతల్ని అభ్యర్థించింది తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి. ఓటీటీ వేదికలకు సినిమాల్ని అమ్ముకోకుండా, అక్టోబరు వరకు నిర్మాతలు ఓపిక పట్టాలని కోరింది. థియేటర్లే సినీ పరిశ్రమ భవిష్యత్తు అని పలువురు ప్రదర్శనకారులు అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండలి అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడారు.
"మా అందరి అభిప్రాయం ఒక్కటే. థియేటర్ల మనుగడ కొనసాగాలంటే అక్టోబరు 30 వరకు నిర్మాతలెవరూ వాళ్ల సినిమాల్ని ఓటీటీకి అమ్ముకోకూడదు. ఈ విషయంపై నిర్మాతల్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం."
- మురళీ మోహన్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు
"మా అభ్యర్థన నిర్మాతలందరికీ తెలియాలనే సమావేశం ఏర్పాటు చేశాం. ఆగస్టు మొదటివారంలో పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నాం. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా నిర్మాతల బాధలు తెలుసు. కానీ కరోనాతో నిర్మాత కంటే కూడా పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకే ఓటీటీకి సినిమాలు ఇవ్వకుండా, అక్టోబరు 31 వరకు ఓపిక పట్టాలి. అప్పటికీ థియేటర్లు తెరుచుకోకపోతే అప్పుడు ఓటీటీవైపు వెళ్లాలని కోరుతున్నాం."
- సునీల్ నారంగ్, వాణిజ్య మండలి కార్యదర్శి
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ఛైర్మన్ అభిషేక్ నామా, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఉపాధ్యక్షుడు శ్రీధర్, ఎగ్జిబిటర్లు బాల గోవిందరాజు, సదానంద్ గౌడ్, అనుపమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.. OTT Movie News: 'ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేయొద్దు'