శివరాత్రి రోజున పగలు ఉపవాసం, రాత్రి జాగారంతో ప్రజలు ఈశ్వరునిపై భక్తిని చాటుకుంటారు. ఓం నమ: శివాయ అంటే చాలు రాక్షసులకైనా దివ్యమైన వరాలను ప్రసాదిస్తాడు బోళా శంకరుడు. అనురాగంతో అక్కున చేర్చుకుంటాడు. ఆగ్రహం వస్తే మూడో కంటితో మన్మథుడినైనా భస్మం చేస్తాడు. మరి ఆ ఈశ్వర కటక్షాన్ని పొందిన కొందరు మహా భక్తులనిప్పుడు చూద్దాం!
భక్తకన్నప్ప
శివలింగం నుంచి కన్నీరు కారుతోందని ఏకంగా తన కళ్లనే తీసి సమర్పిస్తాడు భక్తకన్నప్ప. నాస్తికుడిగా అడవిలో జీవిస్తున్న వేటగాడి కళ్లను తెరిపించి మరో జీవితాన్ని ప్రసాదించాడు శివుడు. "పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను" అంటూ దీనంగా ప్రార్థించే భక్తుడిని కటాక్షించి మోక్షమార్గాన్ని ప్రసాదిస్తాడు పరమశివుడు.మహాభక్త సిరియాళ
అన్ని దానాల్లో కంటే ఉత్తమమైనది అన్నదానం. నిత్య అన్నదాతగా పేరుగాంచిన ఆ సిరియాళుడు నమ్ముకున్న ధర్మకోసం కన్నబిడ్డ ప్రాణాన్ని పణంగా పెడతాడు. భక్తుడిని పరీక్షించడానికి బైరాగి రూపంలో అతిథిగా వస్తాడు శివుడు. నరమాంసం కావాలని అడిగిన ఆ భైరాగి మాటలను అంగీకరించి కన్నబిడ్డనే నైవేద్యంగా అర్పిస్తాడు సిరియాళుడు. భక్తుడి సాహసాన్ని మెచ్చిన శివుడు ఆయనను కటాక్షిస్తాడు.
మంజునాథుడు
ఆ దేవదేవుని కోసం ఏకంగా కోటి శివలింగాలను నిర్మిస్తాడు మంజునాథుడు. ధర్మో రక్షిత రక్షిత: అంటూ ధర్మం గొప్పతనాన్ని లోకానికి చాటిచెబుతూ శివతత్వాన్ని వ్యాప్తి చేస్తాడు. కర్ణాటకలో ఉన్న ధర్మక్షేత్రాన్ని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా మారుస్తాడు.మార్కండేయుడు
మార్కండేయుడు చిన్నప్పటి నుంచే పరమశివుడికి భక్తుడు. పదహారేళ్లకే మహా భక్తుడిగా మారతాడు. తన ప్రాణాలను హరించేందుకు వచ్చిన యముడిని ధిక్కరిస్తాడు. యమపాశం నుంచి తప్పించుకోడానికి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని పరమేశ్వరుడిని స్తుతిస్తాడు బాలుడు. ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో కాలయముడిని దండించి మార్కండేయుని ప్రాణాలను కాపాడతాడు.రావణాసురుడు
రాక్షసుడైనా... రావణుడు తన భక్తితో ఆ పరమేశ్వరుడిని మెప్పిస్తాడు. శంకరుడి కోసం తపస్సు చేసి చావులేని వరాన్ని పొందుతాడు. మరోమారు తల్లికిచ్చిన మాట కోసం కైలాసనాథుడి కోసం తపించి అనుగ్రహాన్ని పొందుతాడు. ఈశ్వరుడి నుంచి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు.