కుందనపు బొమ్మగా తెలుగునాట అడుగుపెట్టి మాయ చేసింది.. ‘అత్తారింటికి దారేది’లో శశిగా ‘అఆ’లో అనసూయగా అల్లరి చేసి వినోదాన్ని పంచింది. ‘రంగస్థలం’లో రామలక్ష్మిగా వైవిధ్యాన్ని చూపింది. ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్‌లో పూర్తిగా ప్రతినాయిక పాత్రలో విలనిజాన్ని పండించబోతోంది సమంత.. విభిన్న పాత్రలెంచుకోవడం ఈమెకు కొత్తేమీ కాదు. సినిమాలు, పాత్రల ఎంపికలో మొదటి నుంచే కొత్తదనం చూపుతూ దూసుకెళ్తోంది. జూన్4న ‘ఫ్యామిలీ మ్యాన్: సీజన్2’ విడుదల సందర్భంగా ఈ కుందనపు బొమ్మ వెండితెరపై చూపిన వైవిధ్యాన్ని ఓ సారి పరిశీలిద్దాం!
రెండో సినిమా నుంచే..
తొలి సినిమాలో అచ్చ తెలుగు ఆడపిల్లలా.. సొగసైన చీరకట్టులో జెస్సీ పాత్రలో కుర్రకారు మది దోచింది సమంత. ‘ఏమాయ చేశావే’లో నాగచైతన్యతో కలిసి వచ్చే ప్రేమ సన్నివేశాలు, పాటల్లో పద్ధతిగా కనిపించి ప్రేమాభిమానాలు పొందింది. అయితే రెండో చిత్రం ‘బృందావనం’ నుంచే పంథా మార్చింది. అందులో పూర్తి గ్లామర్ రోల్‌ను ఎంచుకుంది సమంత. ఎన్టీఆర్‌తో డ్యాన్సులు, కామెడీ సన్నివేశాలతో తనదైన ముద్ర వేసింది. మహేశ్‌బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘దూకుడు’లోనూ అలాంటి పాత్రనే ఎంచుకుని టాలీవుడ్‌లో దూసుకెళ్లిందీ కుందనపు బొమ్మ..
రామలక్ష్మిగా..
తెలుగులో గ్లామర్ డాల్‌గా ముద్ర వేసుకున్న సమంత ‘రంగస్థలం’తో మళ్లీ రూటు మార్చుకుంది. అందులో రామలక్ష్మిగా పూర్తి డీగ్లామర్ రోల్‌లో నటించి మెప్పించింది. రామ్‌చరణ్‌కు జంటగా నటించి సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది సామ్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంతను కొత్తగా చూపించారు. వ్యవసాయం చేసుకొనే పల్లెటూరి అమ్మాయిగా నటించి మెప్పించింది.
సాహసాలంటే ప్రీతి..
‘జనతా గ్యారేజ్’, ‘మెర్సల్’, ‘రంగస్థలం’, ‘మహానటి’ ఇలా వరుస సూపర్ హిట్లతో జోరు మీదున్న సమంత ఒక్కసారిగా ‘యూటర్న్’ లాంటి థ్రిల్లర్‌ను ఎంచుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. కన్నడ నాట సూపర్ హిట్‌గా నిలిచిన ‘యూ టర్న్’ను తెలుగు, తమిళంలో రీమేక్ చేసింది. కెరీర్ తారస్థాయిలో కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడం సాహసమనే చెప్పాలి. దీనికన్నా ముందు ‘రాజుగారి గది 2’ అనే హారర్ చిత్రంలోనూ నటించింది.
సూపర్ డీలక్స్..
కొత్తదనం ఉన్న పాత్రలను ఎంచుకొనేందుకు సమంత ఏమాత్రం వెనకాడదని చెప్పడానికి సూపర్ డీలక్స్ సినిమానే సరైన ఉదాహరణ. ఇందులో సమంత వివాహితగా నటించింది. పెళ్లైనా మాజీ ప్రియుడితో సన్నిహితంగా ఉండి చిక్కుల్లో పడే వెంబుగా నటించి మెప్పించింది. ఇందులో సమంతకు భర్తగా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించాడు. తమిళంలో వైవిధ్యమైన చిత్రంగా ‘సూపర్ డీలక్స్’ నిలిచింది. ఇందులో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అప్పుడు ఓ బేబీ.. ఇప్పుడు శాకుంతలం..
సమంత వైవిధ్యాన్ని ఎంతగా ఇష్టపడుతుందో చెప్పడానికి ‘ఓ బేబీ’కి మించిన ఉదాహరణ లేదేమో. 70 ఏళ్లు పైబడిన లక్ష్మి ఒక్కసారిగా 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలా మారిపోతే ఏం జరిగిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో బేబీగా సమంత చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. థియేటర్ నిండా నవ్వులు పూయించిందీ సినిమా. దీన్ని ‘మిస్ గ్రానీ’ అనే కొరియన్ చిత్రం ఆధారంగా నందినీరెడ్డి తెరకెక్కించారు. తెలుగులో వివిధ ప్రయోగాలు చేసిన సమంత మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్న ‘శాకుంతలం’లో శకుంతలగా నటించనుంది.
హోస్టుగానూ..
కెరీర్ మొదటి నుంచి కొత్తదనాన్ని చూపుతూ వచ్చిన నటి సమంత.. హోస్ట్‌గానూ అవతారమెత్తింది. ‘బిగ్‌బాస్’లో నాగార్జునకు బదులుగా వెళ్లి వ్యాఖ్యాతగా తెలుగు ప్రజల మనసులు దోచుకుంది. ఆ తర్వాత ‘సామ్ జామ్’ పేరుతో ఆహా ఓటీటీలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలను చేసింది. ఇలా తనకు వీలు చిక్కిన ప్రతీసారి ఏదో ఒక ప్రయోగంతో అలరించిన ఈ భామ ఈ సారి ఫ్యామిలీ మ్యాన్‌తో మరో భారీ ప్రయోగమే చేసింది.
‘ఫ్యామిలీ మ్యాన్’తో ‘రాజీ’లేని పోరాటం
‘‘నాన్ ఎల్లారయుమ్ కొల్లువెన్’’ అంటూ సమంత కసిగా పలికే డైలాగ్స్‌తో ఆసక్తిని రేపింది ఫ్యామిలీమ్యాన్: సీజన్2 ట్రైలర్. దానర్థం ‘నేను అందరినీ చంపేస్తా’ అని. ఇప్పటివరకూ సున్నితమైన పాత్రలే చేసిన సమంత. మొదటి సారి పూర్తిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు తమిళనాడులో హీట్‌ను పెంచాయి. అయితే దానికి దర్శక ద్వయం రాజ్ డీకే వివరణ ఇచ్చుకున్నారు. రాజీ పాత్రను సమంత ఎంతలా రక్తికట్టించిందో తెలుసుకోవాలంటే ఫ్యామిలీమ్యాన్ రెండో సీజన్‌ను చూసి తీరాల్సిందే.
ఇవీ చదవండి: