మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తున్నారా! అందులో టిరియన్ లానిస్టర్ పాత్ర గుర్తుందా! పొట్టిగా ఉండి తన మాటలు, తెలివి తేటలతో ఇతరులను బురిడి కొట్టిస్తూ ఎన్నో సందర్భాల్లో కష్టాల నుంచి తప్పించుకుంటాడు. తాజాగా అతడు పాకిస్థాన్ రావల్పిండిలోని రెస్టారెంటులో పనిచేస్తూ అందరిని ఆశ్చర్యపరిచాడు! కంగారు పడకండి ఇక్కడ పనిచేస్తుంది టిరియన్ కాదు అచ్చం అతడి పోలికలతో ఉన్న రోజి ఖాన్.
2011లో ప్రారంభమైన గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌లో టిరియన్ పాత్రను పీటర్ డక్లాంజే పోషించాడు. పాకిస్థాన్ రావల్పిండిలోని రెస్టారెంటులో పనిచేస్తున్న రోజి ఖాన్ అచ్చుగుద్దినట్టు పీటర్లానే ఉన్నాడు. ఆ రెస్టారెంటు యజమాని కొడుకు మాలిక్ అస్లాం చెప్పే దాకా ఖాన్‌కు కూడా తెలియదట గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడి గురించి. అనంతరం టిరియన్కు అభిమానిగా మారిపోయాడు ఖాన్.
రోజి ఖాన్ ఫొటోను ఫేస్బుక్లో పెట్టాడు మాలిక్. ఇంకేముంది జనాలు ఆ వెయిటర్‌తో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. రోజీ ఖాన్, పీటర్ల పోలికలే కాదు... ఇద్దరి ఎత్తు 1.33 మీటర్లు (4 అడుగుల 5 అంగుళాలు) సమానమే.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రానికి చెందిన ఖాన్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడిని కలిసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. అతడితో కలిసి నటించాలని తన మనసులో మాట బయట పెట్టాడు. ఇప్పటికే పాకిస్థాన్‌లో ఓ వాణిజ్య ప్రకటనలోనూ నటించాడీ టిరియన్ లానిస్టర్ డూప్.
పీటర్ డక్లాంజేలా ఉన్నానని అందరూ నాతో సెల్ఫీలు దిగుతున్నారు. పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో నా ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు నేనెంతో పాపులర్ అయ్యాను. పీటర్‌ను కలవాలనుకుంటున్నా. అతడితో కలిసి నటించాలనుకుంటున్నా. -- రోజి ఖాన్