అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్న రియాల్టీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ గేమ్ షో ఎంతోమందిని లక్షాధికారుల్ని, కొంతమందిని కోటీశ్వరుల్ని చేసింది. త్వరలో 12వ సీజన్ ప్రారంభం కానుంది. కరోనా ప్రభావంతో షోలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్లు నిర్వాహకురాలు సుజాతా సంగమిత్రా చెప్పారు.
'షోలో పాల్గొనే వారి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే ఆడిషన్స్ తీసుకున్నాం. అలాగే ఈ ఏడాది షోలో ప్రేక్షకులు పాల్గొనే అవకాశం లేకపోవడం వల్ల లైఫ్‌లైన్స్ నుంచి ఆడియన్స్ పోల్ తీసివేశాం. ఈ ఇరవై ఏళ్లలో ఆడియన్స్ పోల్ లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. దీనికి బదులు 'వీడియో ఏ ఫ్రెండ్' లైఫ్‌లైన్ అందుబాటులోకి తీసుకువచ్చాం. కార్యక్రమంలోని మొదటి రౌండ్ 'ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్'లోనూ కొన్ని మార్పులు చేశాం. గత సీజన్ వరకూ ఈ రౌండ్‌లో 10 మంది పాల్గొనేవారు. సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ రౌండ్‌లో పాల్గొంటారు. అలాగే అమితాబ్ కుర్చీకి, హాట్‌సీట్‌కు మధ్య దూరం కూడా పెంచాం. అదేవిధంగా కంటిస్టెంట్స్‌ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోను షో ప్రారంభంలో చూపించేవాళ్లం. ఈ ఏడాది ఇతర ప్రాంతాలకు వెళ్లలేని కారణంగా, వారినే వీడియో రూపొందించమని చెప్పాం. వీడియో చిత్రీకరణలో ఆన్‌లైన్ ద్వారా పలు సూచనలు చేస్తున్నాం' -సుజాత సంగమిత్రా, షో నిర్వహకురాలు
సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న కేబీసీ సీజన్ 12 కోసం ఇప్పటికే అమితాబ్ షూట్‌లో పాల్గొంటున్నారు.