తెలుగు తెరపై స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు. ఒకరు గ్లామర్, గడసరి పాత్రలతో ఆహా అనిపించుకుంటే, మరొకరు గ్లామర్‌తోపాటు, స్టైలిష్ రోల్స్‌తో ఓహో అనిపించుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్లుగా అదరగొట్టిన వీరు సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా అదే జోరు, అదే హుషారుతో దూసుకెళ్తున్నారు. వారే ఎవర్‌గ్రీన్ హీరోయిన్లు ఆమని, ఇంద్రజ. ఆలీ వ్యాఖ్యాతగా 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారిలా..
ఇంద్రజ.. ఆమని ఇవి మీ అసలు పేర్లేనా?
ఇంద్రజ: కాదండీ..! అసలు పేరు రాజాతి. నేను పుట్టినప్పుడు కనకలక్ష్మి అని పెట్టారు. అది మా నానమ్మ పేరు.
ఆమని: నా అసలు పేరు మంజుల. తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు మీనాక్షి అని పెట్టారు. తెలుగులో ఆమని అయ్యాను. 'జంబలకిడి పంబ' సినిమా కోసం ఈవీవీ సత్యనారాయణగారు నాకు ఆమని అని పెట్టారు. ఈ సినిమా కన్నా ముందు తెలుగులో ‘ఆడది’ చేశాను. కానీ, అది నెగెటివ్ రోల్. పెద్దగా గుర్తింపు రాలేదు.
ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?
ఆమని: అన్ని భాషల్లో హీరోయిన్‌గా 90కు పైగా సినిమాల్లో చేశా. పెద్ద పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది. అది నా అదృష్టం.
మీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? అంతకుముందే మీ మధ్య పరిచయం ఉందా?
ఆమని, ఇంద్రజ: ఇండస్ట్రీకి వచ్చాకే స్నేహితులమయ్యాం.
ఇంద్రజ: ఆమనిగారు, సౌందర్యగారు నాకు సీనియర్లు. కానీ, వాళ్లిద్దరూ ఆ భావన చూపించలేదు. అయితే, ఆమని అక్క, నేను చెల్లిగా కలిసి మూడు సినిమాలు చేశాం. అప్పుడు బాగా పరిచయం. 'హలో బ్రదర్'లో నాగార్జునగారితో కలిసి సాంగ్ చేశాం. అప్పుడు పెద్దగా మాట్లాడుకోలేదు. 'శుభమస్తు' చిత్రం నుంచి మా పరిచయం బాగా పెరిగింది.
ఆమని: దర్శకుడు శ్రీనివాసరెడ్డి గారు 'అమ్మ దొంగ'లో ఇంద్రజ చేసిన పాత్ర నాకు మొదట చెప్పారు. 'నాకు ఎప్పుడూ హోమ్లీ క్యారెక్టర్‌లే ఇస్తారేంటి? ప్లీజ్ మార్చండి' అంటే 'వేరే క్యారెక్టర్ చేస్తే సీన్లు తక్కువ వస్తాయి. పర్వాలేదా?' అన్నారు. మోడ్రన్ డ్రెస్‌ల్లో కనపడాలని నేను కూడా ఓకే అన్నాను. ఇప్పటి వరకూ ఇంద్రజకు కూడా ఈ విషయం తెలియదు. అయితే, ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా తక్కువ. సాంగ్స్ చేసేటప్పుడు నాకు చాలా భయం వేసేది. నేనే భయపడుతున్నానంటే, సౌందర్య కన్నా ఎక్కువ భయపడేది. ఇంద్రజ మాకంటే బాగా చేసేది. అయితే, 'యాక్షన్' అనగానే అందరం పోటీ పడి చేసేవాళ్లం.
'జంబలకిడి పంబ' ఆడిషన్‌కు వెళ్తున్నప్పుడు ఒక విషాద ఘటన జరిగిందట కదా!
ఆమని: మా నాన్న చనిపోయారు. పైగా, అలాంటి పరిస్థితుల్లో ఆడిషన్స్‌కు వెళ్లి సెలక్ట్ కావడం కష్టం ఉంటుంది. నేనూ బాధతో ఉండేదాన్ని. 'నాకు ఆసక్తి లేదండి. రాలేను' అని చెప్పేశాను. కానీ, ఈవీవీగారు అమ్మకు ఫోన్ చేసి, 'అమ్మాయి ఫొటో ఓకే అండీ. కాకపోతే, ఒకసారి ఆడిషన్ చేస్తే బాగుంటుంది' అని అన్నారు. దీంతో అమ్మ నన్ను ఒప్పించింది.
ఇంద్రజ ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు?
ఇంద్రజ: నేను కూడా హీరోయిన్‌గా 90కు పైగా సినిమాల్లో చేశా. 'యమలీల' కన్నా ముందు రెండు తమిళ సినిమాల్లో చెల్లెలి పాత్ర పోషించా. ఆ తర్వాత మళ్లీ చదువుకుందామని వెళ్లిపోయా. ఎందుకంటే నేను బాగా చదివేదాన్ని. స్కూల్ టాపర్. చదువు మానేసి నటనకు వచ్చేశానని బాధపడేదాన్ని. చదువుకోలేకపోయానేనని అమ్మానాన్నల మీద కోపం వచ్చేది. అయితే 'యమలీల' తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఈ ఫీల్డ్‌కు రాకపోతే, మీడియా పర్సన్ అవ్వాలని ఉండేది. లేకపోతే బయోసైన్స్ అంటే ఇష్టం. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులకు మందులు కనిపెట్టాలని ఉండేది. మాకు ఒక అన్నయ్య ఉంటే, ఇంటి బాధ్యతలు తీసుకునేవాడు కదా! అనిపించేది. అయినా, ఇప్పుడు అందరం సెటిల్ అయ్యాం. నాకు ఒక పాప.
ఆమని: నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఒకటో తరగతి చదువుతున్నాడు. పాప యూకేజీ.
మీకు ఒక బ్రదర్ ఉన్నారు. మీరిద్దరూ ఉండగా, మీ అమ్మ మరో ఇద్దరు పిల్లలను ఎందుకు దత్తత తీసుకున్నారు?
ఆమని: ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే, తనది కూడా వాళ్లకు పెట్టేస్తుంది. తల్లిదండ్రులు లేక ఇద్దరు పిల్లల బాధపడుతున్నారని తెలిసి, వాళ్లను దత్తత తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే నా కన్నా ఎక్కువగా వాళ్లను పెంచింది. వాళ్లు కూడా అంతే ప్రేమతో ఉంటారు. నేను సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఐదు నెలల పాపను దత్తత తీసుకున్నారు. నేను షూటింగ్స్ వెళ్తుంటే, నాతో పాటు తీసుకొచ్చేవారు. అందరూ నా కూతురు అనుకునేవాళ్లు. దీంతో అమ్మ షూటింగ్స్‌కు రావడం మానేశారు. నాకు కూడా ఒంటరిగా వెళ్లడం అలవాటైంది. ‘ఏంటి ఆమని షూటింగ్ అంటే అందరూ అమ్మానాన్నలతో ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు. నువ్వేంటి ఒంటరిగా వస్తున్నావు’ అని నాగార్జునగారు అడిగేవారు. జరిగింది ఆయన చెప్పేదాన్ని. ఇప్పటివరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ వేదిక మీద చెబుతున్నా.
ఒకే సంవత్సరంలో 11 సినిమాలు చేశారు కదా! అప్పుడు ఎలా అనిపించేది?
ఆమని: నాకు ఐదేళ్ల వయసున్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. చాలా క్రేజ్. ఎలాగైనా సినిమాల్లోకి రావాలని ఉండేది. ఏదో ఒక సినిమా చూస్తూ ఉండేదాన్ని. ఆ ఆసక్తితోనే హీరోయిన్ అయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకునేదాన్ని కాదు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే మరో సెట్‌కు వెళ్లిపోయేదాన్ని. అక్కడే నిద్రపోయేదాన్ని. ఒక సంవత్సరంలో 11 సినిమాలు చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఏడాది మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ‘మిస్టర్ పెళ్లాం’. నంది అవార్డు కూడా వచ్చింది.
'శుభలగ్నం'లో పాత్ర చేయడానికి భయపడ్డారట!
ఆమని: మొదట నాకు పూర్తి కథ చెప్పలేదు. కొన్ని సీన్లు తీసిన తర్వాత నాది నెగెటివ్ రోల్ అని అర్థమైంది. అయితే, డైరెక్టర్‌ను ఈ విషయం అడగాలంటే భయం వేసింది. ఆ సినిమాలో సుహాసినిగారు కూడా నటించారు. ఆమె వచ్చి 'డైరెక్టర్ గారూ ఈ అమ్మాయి పాత్ర ఏంటి' అని అడిగారు. అప్పుడు ఆయన కథ మొత్తం చెప్పారు. 'నీ పాత్ర చాలా బాగుంటుంది' అని సుహాసినిగారు చెప్పిన తర్వాత నా మనసు కుదటపడింది.
'శుభ సంకల్పం' చేయడం మీ అదృష్టమా! వాళ్ల అదృష్టమా!
ఆమని: కచ్చితంగా నా అదృష్టం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మించి, కె.విశ్వనాథ్‌గారు దర్శకత్వంలో కమల్‌హాసన్‌గారు నటించారు. అందరూ లెజెండ్స్. వాళ్ల మధ్య నేను చిన్న పువ్వును మాత్రమే. మొదటిరోజే భయపడిపోయా. పైగా అదే రోజు కమల్‌హాసన్‌గారిని కొట్టే సీన్ తీశారు. భయంతో నిజంగా ఆయన్ను కొట్టేశా. ఆ సీన్ అయిపోయిన తర్వాత పక్కకు పిలిచి 'అమ్మా కొట్టడం అంటే నిజంగా కొట్టడం కాదు. యాక్ట్ చేయాలి' అన్నారు. ఈ సినిమా కోసం బాలసుబ్రహ్మణ్యంగారి ఇంటి వద్ద మేకప్ టెస్ట్ చేశారు. అయితే, సెట్‌పైకి వెళ్లిన తర్వాత కెమెరామెన్ పీసీ శ్రీరాంగారు మొత్తం మేకప్ అంతా తీయించేశారు. డీ గ్లామర్‌పాత్రలో ఎలా ఉంటానా? అని భయపడ్డా. కానీ, తెరపై బాగా కనిపించా.
ఒక కోర్టు కేసు ఉంటే, మలయాళ హీరో పరిష్కరించారట. ఏం జరిగింది?
ఇంద్రజ: అదేం లేదండీ.. అవన్నీ మీడియా రాతలు. ఒక సినిమా కోసం అగ్రిమెంట్‌పై సంతకం పెట్టా. ఆ తర్వాత నేను ఇచ్చిన డేట్స్‌లో వాళ్లు సినిమా తీయలేదు. వాళ్లు సినిమా మొదలు పెట్టే సమయానికి నేను మమ్ముటిగారితో 'క్రానిక్ బ్యాచిలర్' అనే మరో సినిమా చేస్తున్నా. తెలుగులో 'ఖుషీ ఖుషీగా' పేరుతో తీశారు. అక్కడ నేను చేసిన పాత్రను ఇక్కడ రమ్యకృష్ణ చేశారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు అగ్రిమెంట్ చేయించుకున్న సినిమా మొదలు పెట్టి, మీరు సంతకం పెట్టారు. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి’ అని అన్నారు. 'నాకు కష్టమండీ' అంటే 'లేదు రావాల్సిందే' అన్నారు. ఈ విషయం మమ్ముటిగారికి తెలిసి 'ఆమె సినిమా చేయను అని చెప్పటం లేదు కదా! ఈ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ సినిమా చేస్తారు' అని వాళ్లతో మాట్లాడారు. బేసిగ్గా ఆయన లా చదువుకోవటంతో మీడియా ఇష్టం వచ్చినట్లు రాసింది. 'ఇంద్రజ ఏదో వివాదంలో చిక్కుకున్నారట. స్వయంగా మమ్ముట్టి వచ్చి కోర్టులో కేసు వాదించారట' అని ఏవేవో రాశారు.
ఆమని: మీడియా అంతేనండీ.. ఇటీవల సెట్‌లో కొందరికి ఫుడ్ అలర్జీ వచ్చింది. ఎందుకైనా మంచిదని నేను ఆస్పత్రికి వెళ్లా. అది హార్ట్ స్పెషలిస్ట్ ఆస్పత్రి కావడంతో 'ఆమనికి గుండె పోటు వచ్చింది' అని రాసేశారు. (నవ్వులు)
మీ ఆయన రూ.2500 పెట్టి బొమ్మ కొనిస్తే కోప్పడ్డారట!
ఇంద్రజ: పుట్టినరోజుకు చాలా పెద్ద టెడ్డీ తీసుకొచ్చారు. ఎందుకలా డబ్బులు వృథా చేస్తున్నారని కోప్పడ్డానంతే. దాని తర్వాత అసలు ఏమీ తీసుకురావడం లేదు.(నవ్వులు)
'జంబలకిడి పంబ'లో లాగా క్యారెక్టర్లు మారిపోతే మీరేం చేస్తారు!
ఆమని: హాయిగా ఆఫీస్‌కు వెళ్లి పనిచేసుకుంటా. ఇప్పుడు మహిళలు ఆఫీస్‌కు వెళ్లినా కూడా వచ్చిన తర్వాత అన్నీ పనులు చేసుకోవాల్సి వస్తోంది. సెలబ్రిటీ అయినా కూడా ఇంటి పని తప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో వలే పురుషులు పురిటి నొప్పులు పడాలి. అప్పుడే ఆడవాళ్ల కష్టం తెలుస్తుంది. 'జంబలకిడి పంబ'లో మందుకొట్టి, సిగరెట్ కాల్చే సీన్లు ఉంటాయని డైరెక్టర్‌గారు మొదట నాకు చెప్పలేదు. సడెన్‌గా ఒకరోజు ఆ సీన్ చేయాలని చెప్పారు. సిగరెట్ తాగుతుంటే దగ్గు వచ్చేది. రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేస్తే, సింగిల్ షాట్‌లో ఓకే అయింది. మందుతాగే విషయంలోనూ అలాగే జరిగింది. ఒక ఆర్టిస్ట్‌గా ఇవ్వన్నీ చేయాల్సిందే. మందుతాగినట్టు యాక్ట్ చేశాను. కానీ, సిగరెట్ మాత్రం కాల్చాల్సి వచ్చింది.
'జంబలకిడి పంబ' తర్వాత చేసిన సినిమా ఏంటి?
ఆమని: 'ప్రేమే నా ప్రాణం'. పూర్తి ప్రేమ కథ. అయితే, ఈ సినిమా పెద్దగా ఆడలేదు. మూడో సినిమా 'మిస్టర్‌పెళ్లాం'. చాలా పరిణతి చెందిన పాత్ర. నేను సరిపోతానా? లేదా? అని బాపుగారు ఒకట్రెండుసార్లు చెక్ చేసుకున్నారు కూడా. ఆయన దర్శకత్వంలో చేయడం చాలా కష్టం. కేవలం హావభావాలు పలికించాలి. ఇంకో విషయం.. ఆయన సినిమా చేసిన తర్వాత దాని నుంచి బయటకు రావటానికి సమయం పడుతుంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎక్కువ ఫ్లాప్స్ వచ్చాయి. ఆర్నెల్లు విరామం కూడా తీసుకున్నా. 'మరో క్విట్ ఇండియా'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చా.
సినిమాల్లోకి వెళ్తానంటే 'నువ్వు కలర్ తక్కువ. సినిమాలు అవసరమా' అన్నారట!
ఆమని: చాలా వివాదం నడిచింది. నాకు కాస్త సిగ్గు ఎక్కువ. చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే గదిలోకి వెళ్లిపోయేదాన్ని. అలాంటిదాన్ని సినిమాల్లోకి వెళ్తానంటే అందరూ నవ్వారు. దాన్ని సవాల్‌గా తీసుకుని నన్ను నేను మార్చుకున్నా! చెల్లెలి పాత్రలు వచ్చాయి. కానీ, చేయలేదు. ఏదేమైనా హీరోయిన్‌గా చేయాలనుకున్నా.
చూస్తుండగానే పాతికేళ్లు గడిచిపోయాయి! 90ల్లో హీరోయిన్లు అందరూ కలుస్తారా?
ఆమని: అప్పుడప్పుడు కలుస్తుంటా. ప్రస్తుతం 'సిసింద్రీ' అఖిల్‌తో ఇప్పుడు మరోసారి నటిస్తున్నా. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో తల్లిగా చేస్తున్నా. అమలను ఎంత ప్రేమగా, ఆప్యాయంగా పిలుస్తాడో.. నన్ను కూడా అఖిల్ అలాగే పిలుస్తాడు!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Mukku Avinash: 'ముక్కు' అవినాష్ నిశ్చితార్థం- వధువు ఎవరంటే?