చిత్రం: మహాన్; నటీనటులు: విక్రమ్, ధ్రువ్ విక్రమ్, సిమ్రన్, బాబీ సింహా, వాణీ భోజన్, తదితరులు; సంగీతం: సంతోష్ నారాయణన్; కథ, కథనం, దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజ్; నిర్మాత: లలిత్‌కుమార్; నిర్మాణ సంస్థ: సెవెన్ స్క్రీన్ స్టూడియో; విడుదల తేదీ: 10-2-2021; స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైమ్.
విభిన్నమైన కథలు, ఆకట్టుకునే నటనతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటుడు విక్రమ్. గత కొంతకాలం నుంచి సరైన విజయం కోసం ఎదురుచూస్తోన్న ఆయన 'మహాన్'గా సక్సెస్ పొందేందుకు సిద్ధమయ్యారు. మద్యపాన నిషేధం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రచార చిత్రాలు ఇప్పటికే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. మరోవైపు రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ చిత్రంలోనూ తండ్రీకొడుకులుగా నటిస్తుండటం వల్ల ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మరి, అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుందా? 'మహాన్' ప్రేక్షకుల్ని మెప్పించాడా? తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే..!
కథేంటంటే: గాంధీమహాన్ (విక్రమ్) కామర్స్ లెక్చరర్. మహాన్ కుటుంబం తరతరాలుగా మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. అదే ఆదర్శాలతో మహాన్ పెరిగి పెద్దవాడవుతాడు. తన 40వ ఏట ఇకపై తనకు నచ్చినట్టుగా బతకాలని అనుకుంటాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ మద్యం సేవిస్తాడు. ఈ విషయం అతని భార్య నాచికు(సిమ్రాన్) తెలియడం వల్ల వారి మధ్య గొడవలు వస్తాయి. దాంతో నాచి, కొడుకుని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతుంది. మద్యానికి నెమ్మదిగా అలవాటు పడిన మహాన్.. కొద్ది కాలంలోనే ఏపీ మద్యం సిండికేట్‌కు లీడర్ అవుతాడు. ఈ క్రమంలోనే అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? దానివల్ల మహాన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? మహాన్(విక్రమ్), దాదాబాయ్ నౌరోజీ(ధ్రువ్ విక్రమ్)కు మధ్య ఎలాంటి సంఘర్షణలు ఎదురయ్యాయి? వీరి మధ్య నడిచే పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు అనేది కథ.
ఎలా ఉందంటే: కథానాయకుడు సాధారణ జీవితం నుంచి ఒక సిండికేట్ నాయకుడు, మాఫియా నాయకుడిగా ఎదగడం ఆ క్రమంలో వివిధ సవాళ్లను ఎదుర్కొవడం.. తెలియకుండా రక్త సంబంధీకులతోనే పోరాటం చేయాల్సి రావడం, మనం చాలా సినిమాల్లో చూశాం. 'మహాన్' కూడా అలాంటిదే. రెండు బలమైన పాత్రల మధ్య సంఘర్షణలను ఎలా తీర్చిదిద్దారన్న దాని పైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అదీ తండ్రీకొడుకులు రెండు భిన్నమైన పాత్రల్లో ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఈ అంచనాలు అందుకోవడంలో కార్తిక్ సుబ్బరాజ్ కొంత మేరకే సఫలమయ్యాడు. గాంధేయవాదాలను పాటిస్తూ తరతరాలుగా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాన్ కుటుంబం, అదే సిద్ధాంతాలను పాటిస్తూ మహాన్ ఎదగడం తదితర అంశాలతో సినిమా ప్రారంభించాడు. ఎప్పుడైతే మహాన్ తనకు నచ్చినట్టుగా బతకాలనుకున్నాడో అప్పుడే అసలు కథ మొదలవుతోంది. లిక్కర్ సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగే క్రమంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని అలరిస్తాయి. అవన్నీ చకచకా సాగిపోతాయి. ఎప్పుడైతే దాదాబాయ్ నౌరోజీ అలియాస్ దాదా కథలోకి రంగప్రవేశం చేస్తాడో అప్పుడే కథపై మరింత ఆసక్తి ఏర్పడుతుంది. తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా ఆ పాత్రలను మరింత ఆస్తకికరంగా మలిచి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. అలా కాకుండా కేవలం విక్రమ్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు కార్తిక్ సుబ్బరాజ్. ద్వితీయార్థంలో ఒకటి రెండు ట్విస్టులు మినహా.. సినిమా అంతా ఒకే టెంపోలో సాగుతుంది. ప్రతి సన్నివేశంలో కార్తిక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్ కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: నటన, ఎంచుకునే పాత్రలు విక్రమ్‌ను ఒక విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. అయితే కొంతకాలంగా ఆయనకు ఏ సినిమాతోనూ సరైన విజయం లభించలేదు. ఇక తాజాగా వచ్చిన 'మహాన్' ఆయనకు సక్సెస్‌ను అందించడంలో కొంతమేరకు సఫలమైనట్టే. ఈ కథకు మహాన్ పాత్రలో విక్రమ్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. న్యాయం చేశాడు అనడం కన్నా ఒదిగిపోయాడు అనడం సముచితం. తండ్రికి ధీటుగా ధ్రువ్ కూడా దాదా పాత్రలో చక్కని నటన కనబరిచాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ఆయువు పట్టు. అవే అభిమానులను మెప్పిస్తాయి. సిమ్రన్, బాబీ సింహా, తదితరులు తమ పాత్రల మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ శ్రేయస్‌కృష్ణ కెమెరా పనితనం మెప్పించేలా ఉంది. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. ఎడిటర్ వివేక్ హర్షన్ తన కత్తెరకు మరికాస్త పనిచెప్పి ఉండాల్సింది. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తనదైన శైలిలో ఒక క్రైమ్ థ్రిల్లర్‌ను స్మార్ట్ స్క్రీన్‌ప్లేతో తీర్చిదిద్దాడు. అయితే, పూర్తిగా పాత్రల మధ్య బలమైన సంఘర్షణ తీసుకురావడంలో తడబడ్డాడు. 'మహాన్', దాదా పాత్రలను కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకునే తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది.
బలాలు
విక్రమ్, ధ్రువ్
నేపథ్య సంగీతం
ద్వితీయార్థం
బలహీనతలు
నిడివి, బలమైన భావోద్వేగాలు లేకపోవడం
ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: విక్రమ్-ధ్రువ్‌ల మెరుపుల 'మహాన్'
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">