చిత్రం: పెద్దన్న; నటీనటులు: రజనీకాంత్, కీర్తిసురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు; ఛాయాగ్రహణం: వెట్రి, సంగీతం: ఇమ్మాన్, కూర్పు: రూబెన్, నిర్మాణం: కళానిధి మారన్, దర్శకత్వం: శివ; సంస్థ: సన్ పిక్చర్స్, విడుదల: డి.సురేశ్‌బాబు, నారాయణ్‌దాస్ నారంగ్, దిల్‌రాజు; విడుదల తేదీ: 4-11-2021
దీపావళి సినిమాల్లో ప్రత్యేకమైన ఆసక్తిని పెంచిన చిత్రమంటే రజనీకాంత్(Rajinikanth) 'పెద్దన్న'(Peddhanna)నే. మాస్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు శివ తెరకెక్కించడం వల్ల ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. తన అభిమానులైన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడే రజనీకాంత్‌ను దర్శకుడు శివ ఎలా చూపించాడు? ఈ సినిమా(Peddhanna Review) ఎలా ఉంది?
కథేంటంటే: రాజోలు చుట్టు పక్కల గ్రామాలకు పంచాయతీ పెద్ద వీరన్న (రజనీకాంత్). ఆయనకు చెల్లెలు కనకమహాలక్ష్మి (కీర్తిసురేశ్- Keerthy Suresh) అంటే ప్రాణం. ఆమె పిలిస్తే పలకడం కాదు, తలిస్తేనే పలికేంతగా ఉంటుంది ఇద్దరి మధ్య బంధం. చదువుకునేందుకు పట్నం వెళ్లి తిరిగొస్తుందంటే ఊళ్లోనే కాదు, ఆమె ఎక్కొచ్చిన రైలు బండికి కూడా పండగే. కనక మహాలక్ష్మికి చుట్టు పక్కలే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు వీరన్న. మొదట శత్రువుగా ఉండి, ఆ తర్వాత మిత్రుడైన ప్రకాశ్‌రాజ్ కొడుకుతో పెళ్లి నిశ్చయమవుతుంది. అన్న మాట జవదాటని చెల్లెలు ఆ పెళ్లికి అంగీకారం తెలుపుతుంది. తీరా పెళ్లి ముహూర్తానికి ముందు మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. ఇంతకీ ఆమె ఎందుకు వెళ్లిపోయింది? వెళ్లాక ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన మాట కాదని వెళ్లిన చెల్లెలి గురించి వీరన్న పట్టించుకున్నాడా?లేదా?తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో సాగే కథ ఇది. బంధం, గ్రామీణ నేపథ్యం, ప్రతీకారం... తదితర అంశాల చుట్టూ కథ అల్లి, దానికి రజనీకాంత్(Rajinikanth) స్టైల్ మాస్ అంశాల్ని ఆయన హీరోయిజాన్ని జోడించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు శివ. స్వతహాగా రజనీకాంత్ (Rajinikanth) అభిమాని అయిన ఆయన, ఒకప్పుడు తాను చూసిన రజనీని తెరపై చూసుకోవాలనుకున్నారేమో. అలాంటి ఆహార్యంతోనే రజనీని హుషారుగా చూపించారు కానీ, ఈ కథ కూడా పాతకాలాన్ని అప్పటి సినిమాల్ని గుర్తు చేసేలా రాసుకోవడమే సినిమాకు మైనస్‌గా మారింది. రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో కానీ ఎలాంటి కొత్తదనం లేదు.
ప్రథమార్ధం సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. రజనీ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని కామెడీ సన్నివేశాలతో అభిమానులకు నచ్చేలాగే సన్నివేశాలు సాగుతాయి. మరదళ్లుగా ఖుష్బూ(Khushbu), మీనా(Meena) ఎంట్రీ ఇవ్వడం, బావతో కలిసి చేసే అల్లరి, అమాయకులైన వాళ్ల తమ్ముళ్లకు కనక మహాలక్ష్మిని ఇవ్వమని అడగడం తదితర సన్నివేశాలు ఇదివరకు చూసేసినట్టే అనిపించినా కాలక్షేపాన్ని మాత్రం ఇస్తాయి. కనక మహాలక్ష్మి పెళ్లికి ముందు వచ్చే మలుపే తదుపరి కథపై ఆసక్తిని పెంచుతాయి. ద్వితీయార్ధం కథ కలకత్తాకు మారుతుంది. అంతకుముందు కథలో వచ్చిన మలుపు వెనక కూడా బలమైన కారణం లేకపోవడం వల్ల ద్వితీయార్ధం కూడా చప్పగానే మొదలవుతుంది. కలకత్తాలో తన చెల్లెలి కన్నీటికి కారణమైన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడం, చెల్లెలికి అడుగడుగునా రక్షణగా నిలవడమే మిగిలిన కథంతా. బలమైన ఇద్దరు ప్రతినాయకులు ఉద్ధవ్ పారేకర్ (జగపతిబాబు), మనోజ్ పారేకర్ (అభిమన్యు సింగ్) ఢీ కొట్టినా.. ఆ పాత్రలు సినిమా నిడివి పెంచడానికి ఉపయోగపడ్డాయే తప్ప అందులో ఎలాంటి బలం లేదు. జగపతిబాబు(Jagapathi babu) ఆహార్యం భయంకరంగా అనిపించినా చివర్లో ఆ పాత్రను ముగించే తీరు మరీ సాదాసీదాగా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: రజనీకాంత్(Rajinikanth) వన్ మేన్ షో చేశారు. ఆయన స్టైల్, ఆయన మేనరిజమ్స్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. పాటలు, పోరాట ఘట్టాల్ని హుషారుగా చేశారు. కీర్తిసురేశ్(Keerthy Suresh) చెల్లెలి పాత్రలో పర్వాలేదనిపిస్తుంది. నయనతార(Nayanthara) అతిథి పాత్రను గుర్తు చేస్తుంది. రజనీకాంత్ పక్కన సహాయకుడిగా కనిపించే సూరి హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది. మీనా, ఖుష్బూ ప్రథమార్ధంలో చేసిన సందడి ఆకట్టుకుంటుంది. రజనీ సినిమాలో విలన్లు అంటే భయపెట్టేలా ఉండాలి. కానీ ప్రకాశ్‌రాజ్(Prakash Raj), అభిమన్యు సింగ్, జగపతిబాబు పాత్రలు పేలవంగా అనిపిస్తాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇమ్మాన్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వెట్రి కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు శివ కేవలం రజనీపైన, ఆయన స్టార్‌డమ్‌పైన ఆధారపడే ఈ కథను అల్లినట్టు అనిపిస్తుంది.
బలాలు
+ రజనీకాంత్
+ విరామ సన్నివేశాలు
+ అక్కడక్కడా కామెడీ
బలహీనతలు
- కథ.. కథనం
- ద్వితీయార్ధం
చివరిగా: 'పెద్దన్న'... కొత్తగా ఏమీ లేదన్నా!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">