నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్
కళ : వివేక్ అన్నామలై
కూర్పు : అనల్ అనిరుద్దన్
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్
దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
విడుదల: 26-02-2021
ప్రేమకథలతో ఎక్కువగా సందడి చేస్తుంటారు నితిన్. ఆయన ఈసారి వైవిధ్యమైన కథలకి పెట్టింది పేరైన చంద్రశేఖర్ యేలేటితో జట్టు కట్టారు. ఈ కలయిక విడుదలకి ముందే ఆసక్తిని రేకెత్తించింది. చెస్ నేపథ్యంలో సాగే కథ కావడం, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం, 'భీష్మ' విజయం తర్వాత నితిన్ నుంచి వస్తున్న చిత్రం కావడం వల్ల 'చెక్'పై అంచనాలు మరింతగా పెరిగాయి. లాక్‌డౌన్ తర్వాత కథా బలమున్న చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ఈ దశలో 'చెక్' విడుదల కావడం వల్ల ఈ సినిమా కోసం ప్రేక్షకులు మరింత ఆత్రుతగా ఎదురు చూశారు. మరీ చిత్రం అందుకు తగ్గట్టుగానే ఉందా? ఖైదీగా నితిన్ నటన ఎలా ఉంది? చంద్రశేఖర్ యేలేటి టేకింగ్ ఏవిధంగా ఉంది?
కథేంటంటే..
ఉగ్రవాదిగా ముద్రపడిన ఓ ఖైదీ ఆదిత్య (నితిన్). ఉరిశిక్ష పడటం వల్ల రోజులు లెక్కపెడుతుంటాడు. తెలివితేటలు కలిగిన ఆదిత్య తాను ఉగ్రవాదిని కాదని, తానెలాంటి నేరం చేయలేదని కోర్టులో పిటిషన్ వేస్తాడు. కెరీర్‌కు మంచి జరుగుతుందని తండ్రి చెప్పడం వల్ల అతని కేసుని వాదించడానికి ముందుకొస్తుంది న్యాయవాది మానస (రకుల్‌ప్రీత్ సింగ్). కోర్టులో కేసు కొనసాగుతుండగా, జైలులో సహ ఖైదీ శ్రీమన్నారాయణ (సాయిచంద్) వల్ల చెస్ కూడా నేర్చుకుంటాడు ఆదిత్య. కోర్టులో దారులన్నీ మూసుకుపోవడం వల్ల రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంతలో అనుకోని సంఘటనలు జరగడం వల్ల క్షమాభిక్షకు కూడా నోచుకోడు. మరికొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కాల్సిన ఆదిత్య జైలు నుంచి ఎలా బయటపడ్డాడు? అందుకు తాను నేర్చుకున్న చెస్ ఎలా సాయపడింది? ఈ కథలో యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియర్) ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
కథతో పాటే ప్రయాణం చేస్తే 'చెక్' లాంటి సినిమాలొస్తాయి. వాణిజ్య హంగులంటూ ప్రత్యేకమైన జోడింపులు లేకుండా ఓ కథని కథలా చెప్పే ప్రయత్నం చేశారు. ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకుడిని ఆదిత్య ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడక్కడా ఆ సన్నివేశాలు ముందుకు కదలనట్టు అనిపించినా.. చెస్ నేపథ్యం మొదలు కావడం వల్ల అక్కడ్నుంచి ఆట రక్తి కడుతుంది. సామాన్య ప్రేక్షకుడు చెస్ ఆటతో కనెక్ట్ కావడానికి కాస్త సమయం పట్టినా, ఆ తర్వాత మెల్లిగా ఆటతోనూ భావోద్వేగాలు పండుతాయి. చెస్ గురించి తెలియని ప్రేక్షకులకు కూడా మాటలతో ఆటని పరిచయం చేస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు. మధ్యలో మలుపులు థ్రిల్‌ని పంచుతాయి.
ఈ సినిమా అంతా ఒకెత్తైతే, పతాక సన్నివేశాలు మరో ఎత్తు. అయితే అప్పటివరకు చెస్ గురించి ఏమాత్రం తెలియని ఓ కుర్రాడు.. కోచ్‌లు, గ్రాండ్‌మాస్టర్‌ను సైతం ఓడిస్తూ ముందుకు సాగడం చూస్తే దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛని తీసుకుని సన్నివేశాల్ని తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. ఆట నేపథ్యంలో డ్రామా ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. ఒక అమాయకుడికి ఉరిశిక్ష పడినప్పుడు అతనికి విముక్తి లభిస్తే బాగుంటుందని ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ, అలాంటి భావోద్వేగాలేవీ కలిగించకుండానే ఈ సినిమా సాగుతుంటుంది. పతాక సన్నివేశాలు మాత్రం కొత్త అనుభూతిని పంచుతాయి. అక్కడక్కడా చంద్రశేఖర్ యేలేటి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అప్పటివరకు సాగే కథలో ఆ స్థాయి మెరుపులు లేకపోవడం సినిమాకు బలహీనత.
ఎవరెలా చేశారంటే?
నితిన్ వన్ మేన్ షో అనిపించేలా ఉంటుందీ చిత్రం. ఉరిశిక్ష పడిన ఖైదీగా సహజసిద్ధమైన అభినయం ప్రదర్శించాడు. భావోద్వేగాల విషయంలోనూ ఆయన ప్రయత్నం తెరపై కనిపిస్తుంది. రకుల్‌ప్రీత్ సింగ్ మానస అనే న్యాయవాదిగా కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎక్కడా బలమైన వాదనలు వినిపించదు. ప్రియా ప్రకాశ్ వారియర్ కథను మలుపు తిప్పే ఓ చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఓ పాటలో ఆమె అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సాయిచంద్, సంపత్, హర్షవర్థన్, మురళీశర్మ, సంపత్‌రాజ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కల్యాణిమాలిక్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన బలం. రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా, వివేక్ కళా ప్రతిభ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. నరేశ్ అందించిన మాటలు కథకు బలాన్నిచ్చాయి. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మరోసారి ఓ కొత్త రకమైన కథని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. కానీ ఆయన మార్క్ కథనం ఇందులో తక్కువ ప్రభావమే చూపించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు | బలహీనతలు |
+ కథా నేపథ్యం | - సాగదీతగా కొన్ని సన్నివేశాలు |
+ నితిన్ నటన | - ఊహకందే కథ, కథనాలు |
+ పతాక సన్నివేశాలు |
చివరిగా: కొన్ని మెరుపులతో ఆకట్టకునే ప్రయత్నం ఈ 'చెక్'!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- " class="align-text-top noRightClick twitterSection" data="">