సినిమా: మత్తు వదలరా
నటీనటులు: శ్రీ సింహ, నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సంగీత దర్శకుడు: కాలభైరవ
దర్శకుడు: రితేష్ రాణా
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 25-12-2019
క్రైమ్ కామెడీ చిత్రాలకు తెలుగులో కొదవ లేదు. సీజన్‌లతో పని లేకుండా వస్తూనే ఉంటాయి. తక్కువ బడ్జెట్‌తో, పరిమిత వనరులతో, కొత్త వాళ్లతో ఓ సినిమా చేయాలనుకున్నప్పుడు క్రైమ్ కామెడీలే సేఫ్ జోనర్‌గా కనిపిస్తాయి. కొత్త దర్శకులకు, నటీనటులకు ఇదో డెమోగానూ పని చేస్తుంది. 'మత్తువదలరా' టీజర్, ట్రైలర్ చూస్తున్నప్పుడే ఇదో క్రైమ్ కామెడీ అనే సంగతి అర్థమైపోయింది. అయినా ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి, ఆసక్తి పడడానికి కారణం... ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు హీరోగానూ, ఆయన మరో వారసుడు సంగీత దర్శకుడిగానూ పరిచయం అవ్వడం. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ.. ఈ చిన్న చిత్రాన్ని రూపొందించడం ఆసక్తిని రేపింది. మరి ఇన్ని ఆకర్షణల మధ్య వచ్చిన 'మత్తు వదలరా' ఎలా వుంది? ఏ వర్గాన్ని ఆకట్టుకుంటుంది? తదితర విషయాలు తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.
కథేంటంటే:
బాబూ మోహన్, అభి, యేసు (శ్రీసింహా, నరేశ్ అగస్త్య, సత్య) ముగ్గురూ రూమ్మేట్స్. బాబు, యేసులు కొరియర్ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. అభి మాత్రం రూమ్‌లోనే ఉంటూ.. షెర్లాక్ హోమ్స్ సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. బాబుకు నెలంతా పనిచేసినా జీతం డబ్బులు సరిపోవు. ఉద్యోగంపై అసంతృప్తి వస్తుంది. కానీ అంతకంటే తక్కువ సంపాదిస్తూ యేసు ఆనందంగా బతికేస్తుంటాడు. అందుకు కారణం... డెలివరీ ఇస్తూ, వాళ్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ... చిన్న ట్రిక్ ద్వారా సొమ్మును కాజేయడం. యేసు దారిలోకి బాబు వస్తాడు. అది దొంగతనం అని తెలిసినా, తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు సిద్ధమవుతాడు. అయితే బాబు తొలి ప్రయత్నం బెడసి కొడుతుంది. ఓ ముసలమ్మ దగ్గర అడ్డంగా దొరికిపోతాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో, ప్రమాదవశాత్తూ ఆ ముసలమ్మ చనిపోతుంది. అనుకోకుండా ఆ ఫ్లాటులో లాకైపోతాడు. అనుకోని పరిస్థితుల వల్ల 'మత్తు'లోకి జారిపోతాడు. తీరా లేచి చూస్తే... మరో ఫ్లాటులో ప్రత్యక్షం అవుతాడు. తన ఎదురుగా ఓ శవం ఉంటుంది. ఆ కంగారులో ఇంటికొచ్చి చూస్తే... తన బ్యాగులో రూ.50 లక్షలు కనిపిస్తాయి. అసలు ఓ ఫ్లాటులో ఉండాల్సిన తాను మరో ఫ్లాటులోకి ఎందుకు వెళ్లాడు? తన ఎదురుగా ఉన్న మరో శవం ఎవరిది? ఈ రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ చిక్కుముడులు విప్పాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
లైన్ చెప్పగానే ఆసక్తిగా అనిపిస్తుంది. కథలో చాలా మలుపులు ఉన్నాయని అర్థమవుతుంది. అది నచ్చే నిర్మాతలు ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టున్నారు. దర్శకుడూ వీలైనంత నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కథ చాలా సాఫీగా మొదలవుతుంది. ముగ్గురు రూమ్మెట్స్‌ను పరిచయం చేస్తూ, వాళ్ల దినచర్య చూపిస్తూ.. సీరియస్‌గా సాగిపోతున్న ఈ వ్యవహారంలోకి ఓ టీవీ సీరియల్‌ను తీసుకొచ్చి.. వినోదం పంచే ప్రయత్నం చేశాడు. టీవీ సీరియల్‌పై వ్యంగ్యాస్త్రం విసురుతూ నవ్వించాడు. యేసు చోరీ కిటుకులు చెప్పడం, బాబు ఆచరణలో పెట్టడం దగ్గరి నుంచి అసలు కథ మొదలవుతుంది. కాస్త సాగదీత అనిపించినా కథకు కీలకమైన ఘట్టం.. అపార్ట్మెంటులో ముసలమ్మ మరణం, ఆ తర్వాత జరిగే పరిణామాలు. అయితే.. అక్కడ లేని మిగిలిన రెండు పాత్రల్నీ తీసుకొచ్చి, వాటి ద్వారా వినోదం పంచాడు దర్శకుడు. ఆ ట్రిక్ బాగా ప్లే అయింది. విశ్రాంతి ముందు కథ అనేక మలుపులు తిరుగుతుంది. ద్వితీయార్థానికి సరైన వేదిక దొరికినట్టు అనిపించింది.
ఇలాంటి కథలు చిక్కుముడులు వేసినప్పుడు బాగానే ఉంటాయి. విప్పేటప్పుడు అసలు ఇబ్బంది వస్తుంది. ద్వితీయార్ధంలో ఈ చిక్కుముడులు విప్పడానికి దర్శకుడు చాలా కష్టపడాల్సివచ్చింది. కథను చెప్పడానికి అక్కడక్కడా పక్కదారులు ఎంచుకున్నాడు. డ్రగ్స్ మాఫియాను తీసుకొచ్చి, తప్పుకునే ప్రయత్నం చేశాడు. అపార్ట్మెంటులో గంజాయి పెంచడం, కోట్లాది రూపాయల సరుకును అక్కడి నుంచి ఒక్కరే రవాణా చేయడం.. ఇవన్నీ నమ్మేలా అనిపించవు. పాజిటివ్ పాత్రలను నెగిటివ్‌గా మార్చడం, ఓ కెమెరా ద్వారా హీరో నిజం తెలుసుకోవడం ఇవన్నీ దర్శకుడు తన సౌలభ్యం కోసం రాసుకున్నవే అనిపిస్తుంది. ప్రథమార్ధంలో ఉన్న బిగి, ద్వితీయార్ధానికి వచ్చేసరికి లోపించడం.. వినోదం మిస్ కావడం ఇబ్బంది కలిగిస్తాయి. సాగదీత ప్రతికూలాంశంగా మారింది.
ఎవరెలా చేశారంటే:
నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కీరవాణి అబ్బాయి శ్రీసింహాకు ఇదే తొలి సినిమా. తన నటన అత్యంత సహజ సిద్ధంగా ఉంది. అనుభవం లేకపోయినా ఈ మేరకు రక్తి కట్టించాడంటే గొప్ప విషయమే. ప్రేమకథలకు సూట్ అవుతాడో, లేదో చెప్పలేం గానీ.. ఇలాంటి కాన్సెప్ట్ కథల విషయంలో ఢోకా ఉండదు. సత్య మరోసారి ఆకట్టుకున్నాడు. తన కామెడీ టైమింగ్ ఈ సినిమాకు బలమైంది. అపార్ట్‌మెంట్ సీన్‌లో తాను వేసిన వివిధ గెటప్పులు వినోదాన్ని పంచుతాయి. నరేశ్ అగస్త్య కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోయాడు. తనకూ మంచి భవిష్యత్తు ఉంది.
కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించాడు. పాటలు లేవు గానీ, నేపథ్య సంగీతంలో తన మార్కు చూపించారు. ఫొటోగ్రఫీ, ఇతర నిర్మాణ విలువలు బడ్జెట్‌కు తగినట్టే ఉన్నాయి. దర్శకుడిలో విషయం ఉంది. తొలి సగంలో తన మార్కు చూపించాడు. వినోదం పండించగల తెలివితేటలున్నాయి. ద్వితీయార్ధంలో మాత్రం కథను రక్తి కట్టించలేకపోయాడు.
బలాలు
- కథాంశం
- మలుపులు
- సత్య అందించే వినోదం
- నేపథ్య సంగీతం
బలహీనతలు
- ద్వితీయార్ధం
చివరిగా.. ప్రేక్షకులను మత్తెక్కించే ప్రయత్నం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">