ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మే నెల మొదటి ఆదివారం జరుపుకుంటారు. దీనిని తొలిసారి 1998 మే 10న ముంబయిలో నిర్వహించారు. డాక్టర్. మదన్ కటారియా నవ్వుల దినోత్సవానికి ఆద్యుడు. శాంతి, సానుకూల దృక్పథం అలవరుచుకొనేందుకు నవ్వు మంచి ఆయుధమని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రారంభించిన ఈ 'నవ్వుల యోగా'కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం 105 దేశాలలో క్లబ్‌లు ఏర్పడి బాగా విస్తరించింది.
ఈ లాఫింగ్ క్లబ్‌లలో చిన్నపాటి జోక్‌లు చెప్తూ అలరిస్తుంటారు వక్తలు. మానవ జీవితంలో ఎదురయ్యే పని ఒత్తిడిని ఎదుర్కొని మానసికంగా దృఢంగా ఉండేందుకు నవ్వడమే సులభమైన చిట్కా.
నవ్వు వల్ల ఉపయోగాలేంటి..?
- శారీరక విశ్రాంతి: శారీరక అలసట, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి నవ్వు మంచి మందు. నవ్విన తర్వాత 45 నిమిషాల్లో శరీరానికి మంచి విశ్రాంతి దొరికిన అనుభూతి ఏర్పడుతుంది.
- రోగనిరోధక శక్తి: ఒత్తిడిని పెంచే హార్మోన్లకు నవ్వు అడ్డుకట్ట వేస్తూ, రోగనిరోధక కణాల పనితీరును పెంచుతుంది. ఫలితంగా వ్యాధులను తట్టుకునేలా శరీరం తయారవుతుంది.
- ఎండోర్ఫిన్ల విడుదల: నొప్పుల నుంచి ఉపశమనానికి ఎండోర్ఫిన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. నవ్వు వీటిని విడుదల చేసేలా ప్రేరేపిస్తుంది.
- గుండెకు భరోసా: గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నరాలను ఉత్తేజపరిచేందుకు నవ్వు బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా గుండెనొప్పి రాకుండా కొంతమేర నియంత్రిస్తుంది.
- క్యాలరీలు ఖర్చు: 10 నుంచి 15 నిమిషాలు నవ్వితే 40 క్యాలరీలు ఖర్చవుతాయి. ఒక ఏడాది పాటు ఇలా చేస్తే మంచి ఫలితముంటుందని డాక్టర్లు సూచిస్తుంటారు.
- కోపం తగ్గుదల: చిరాకు, కోపం నుంచి బయటపడేందుకు నవ్వే మంచి నివారిణి.
- జీవితకాలం పెరుగుదల: నార్వేలోని ఓ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం ఎవరైతే ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారో వారు మిగతా వారికంటే ఎక్కువ కాలం జీవిస్తారని తేల్చి చెప్పింది.
.
సమాజంలో అందరితో సఖ్యత, స్నేహంగా మెలగాలంటే నవ్వు చాలా ప్రధానమైనది. నవ్వడం జీవితంలో భాగమని తెలియజేస్తూ ప్రపంచవాప్తంగా పేరుగాంచిన చార్లీచాప్లిన్ ... ' ఏదైనా ఒక రోజు నవ్వకపోతే.. ఆ రోజంతా వృధా అయినట్టే' అంటూ హాస్యం విలువను చాటాడు.
నవ్వితే ఉచితంగా ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం నవ్వేయండి మరి.